బషీర్‌బాగ్, వెలుగు: కరెన్సీ నోట్లపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించాలని కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరుశురామ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు.
అంబేద్కర్ స్ఫూర్తితోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు బాటలు పడ్డాయని, ఆర్‌బీఐ ఏర్పడి 91 ఏండ్లు పూర్తయినా కరెన్సీ నోట్లపై ఆయన చిత్రాన్ని ముద్రించకపోవడం చరిత్రను విస్మరించడమేనన్నారు. అంబేద్కర్ చిత్రాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
స్పందించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య ఈ డిమాండ్‌కు తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ నెల 24 నుంచి 27 వరకు కమిషన్ సభ్యులతో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించి ఈ అంశంపై చర్చిస్తామని చెప్పారు.
