ప్రాజెక్టుల పరిహారం లేట్‌‌ చేయొద్దు..కలెక్టర్ల ఖాతాలో ఉన్న 1,200 కోట్లను  రైతుల ఖాతాల్లో వేయండి

ప్రాజెక్టుల పరిహారం లేట్‌‌ చేయొద్దు..కలెక్టర్ల ఖాతాలో ఉన్న 1,200 కోట్లను  రైతుల ఖాతాల్లో వేయండి
  • అధికారులకు మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి ఆదేశాలు
  • భూసేకరణ పరిహారం కోసమే రూ.5 వేల కోట్లు కేటాయించాం
  • నిధులు రాకముందే అవార్డులు, టోకెన్ల ప్రక్రియ పూర్తి చేయాలి
  • కలెక్టర్లు, ఈఎన్సీలు, సీఈలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి భూములిచ్చిన రైతులు, నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి విడుదలైన పరిహారం వెంటవెంటనే వారి ఖాతాల్లో జమచేయాలని అధికారులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. డాక్యుమెంటేషన్ పూర్తయిన చోట ఒకట్రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో పరిహారం జమ కావాలని స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌‌లో ఉన్న కీలక ప్రాజెక్టులకు భూసేకరణ, పునరావాసం (ఆర్ అండ్ ఆర్), అటవీ అనుమతుల అడ్డంకులపై శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సాగునీటి ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టించేందుకు భూసేకరణ, పరిహారం, అటవీ అనుమతుల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి రూ.5 వేల కోట్లను కేటాయించారని గుర్తు చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులు కేవలం కలెక్టర్ల పీడీ (పర్సనల్ డిపాజిట్) ఖాతాల్లో మూలన పడి ఉంటే ప్రయోజనం ఉండదని తేల్చిచెప్పారు. ‘‘ప్రభుత్వం ఏ ఆశయంతోనైతే నిధులు విడుదల చేసిందో ఆ లక్ష్యం నెరవేరాలి. డబ్బులు నేరుగా బాధితుడు లేదా రైతు చేతికి అందినప్పుడే ఫలితం ఉంటుంది’’ అని చెప్పారు. మంజూరు నుంచి లబ్ధిదారుడికి నగదు బదిలీ అయ్యేదాకా మధ్యలో ఎలాంటి పరిపాలనాపరమైన జాప్యం ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు.

ముందే అవార్డులు, టోకెన్లు సిద్ధం చేయండి

నిధులు పీడీ ఖాతాల్లో పడేంత వరకు ఎదురుచూడకుండా.. భూసేకరణ ఫార్మాలిటీలను ముందుగానే పూర్తి చేయాలని కలెక్టర్లకు మంత్రి ఉత్తమ్‌‌ స్పష్టం చేశారు. భూసేకరణ ప్రొసీడింగ్స్, అంగీకార అవార్డులు (కన్సెంట్ అవార్డ్స్), టోకెన్ జనరేషన్ ప్రక్రియలను ముందే పూర్తి చేసి, ఆ వివరాలను ఇరిగేషన్ శాఖకు పంపితే తాము ఆర్థిక శాఖతో మాట్లాడి నిధులు విడుదల చేయిస్తామని చెప్పారు. జగిత్యాల జిల్లాలో ఇప్పటికే ఖాతాల్లో జమైన భూసేకరణ నిధులను లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి వారం రోజుల సమయం కావాలని అధికారులు కోరగా మంత్రి తిరస్కరించారు. నిధులు, లబ్ధిదారుల వివరాలు రెడీగా ఉన్నప్పుడు పరిహారం ఆపడానికి కారణమే లేదని, ఒకటి లేదా రెండు రోజుల్లోనే పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్ ఫీడర్ కెనాల్ తదితర పనులకు సంబంధించి సుమారు 180 ఎకరాలకు వెంటనే కన్సెంట్ అవార్డులు పూర్తి చేయాలని, పూర్తి ఆర్థిక ప్రక్రియ ముగిసే వరకు వేచి చూడొద్దని ఆదేశించారు.

మహబూబాబాద్ జిల్లాలో మున్నేరు–పాలేరు లింక్ కెనాల్ భూసేకరణపై చర్చించారు. రైతులతో సంప్రదింపులు జరిపి సవరించిన పరిహార అంచనాలు, కన్సెంట్ అవార్డుల ప్రక్రియను వేగవంతం చేసి ప్రాజెక్టులో జాప్యం లేకుండా చూడాలన్నారు. అటవీ అనుమతులకు సంబంధించి శాఖల మధ్య సమన్వయ లోపం, సమాచార కొరత కారణంగా సాగునీటి ప్రాజెక్టులు ఆగిపోవడానికి వీల్లేదని ఉత్తమ్  స్పష్టం చేశారు. రెవెన్యూ, ఇరిగేషన్, ఫారెస్ట్ శాఖల అధికారులతో కలెక్టర్లు సంయుక్త సమావేశాలు నిర్వహించి అవసరమైన సమాచారాన్ని వెంటనే సమర్పించాలన్నారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌‌తో పాటు పలు ప్రాజెక్టుల అటవీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌‌లో ఇరిగేషన్ శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్, ఈఎన్సీ (జనరల్) ఓవీ రమేశ్ బాబు, జాయింట్ సెక్రటరీ కె. శ్రీనివాస్, ఈఎన్సీ (అడ్మిన్) టి. శ్రీనివాస్, ఈఎన్సీ (ఓ అండ్ ఎం, క్వాలిటీ కంట్రోల్) ఆర్. మధుసూదన్ రావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వెంటనే రూ.1,200 కోట్లు పంపిణీ చేయాలి

ప్రభుత్వం ఇప్పటివరకు భూసేకరణ, పరిహారం కోసం రూ.2,782 కోట్లు విడుదల చేయగా, అందులో రూ. 566 కోట్లు మాత్రమే లబ్ధిదారులకు చేరాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు. మిగిలిన నిధుల్లో రూ.989 కోట్లు పంపిణీ దశలో ఉండగా, మరో రూ.199 కోట్లు జిల్లాల వద్ద పంపిణీ ప్రారంభం కాకుండా ఉన్నాయని మంత్రి తెలిపారు. అంటే దాదాపు రూ.1,200 కోట్లను చిన్నపాటి ప్రక్రియలు పూర్తి చేసి తక్షణమే రైతులకు చెల్లించే అవకాశం ఉందని, దీనిని కలెక్టర్లు అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకోవాలని సూచించారు. వీటికి అదనంగా రూ.455 కోట్ల విలువైన క్లియర్డ్ టోకెన్లు ప్రాసెసింగ్ కోసం పెండింగ్‌‌లో ఉన్నాయని తెలిపారు. విడుదలైన నిధులకు, రైతులకు చేరిన మొత్తానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కలెక్టర్లు రోజూ పర్యవేక్షించాలని, అవసరమైతే ప్రత్యేక బృందాలు, అదనపు సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు.