- డబుల్ రోడ్డు కోసం పాదయాత్ర
- ఎమ్మెల్యే కవ్వంపల్లి దిష్టిబొమ్మ దగ్ధం
గన్నేరువరం, వెలుగు: రోడ్డు వేయిస్తావా లేక రాజీనామా చేస్తావా అని కరీంనగర్జిల్లా మానకొండూర్ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు మాజీ ఎమ్మెల్యే సరమయి బాలకిషన్సవాల్విసిరారు. గుండ్లపల్లి నుంచి గన్నేరువరం మండల కేంద్రానికి ఆగిపోయిన డబుల్ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలంటూ రసమయి పిలుపుమేరకు శుక్రవారం మండల బీఆర్ఎస్ నేతలు మహా పాదయాత్ర చేపట్టారు. గన్నేరువరం నుంచి గుండ్లపల్లికి చేపట్టిన పాదయాత్రకు భారీగా జనం తరలివచ్చారు. ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ.. గన్నేరువరం మండలానికి డబుల్ రోడ్డు కోసం గతంలోనే రూ.71 కోట్లు మంజూరు చేయిస్తే ఆ పైసలతో రోడ్డు వేయడానికి కూడా ఎమ్మెల్యేకు చేతకావడంలేదని విమర్శించారు.
గుంతల మయమైన రోడ్డులో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే ఆయనకు చీమకుట్టినట్టు లేదన్నారు. కేవలం కమీషన్లపైనే దృష్టి పెట్టి అక్రమ సంపాదనతో కోట్లు గడిస్తున్నాడని ఆరోపించారు. రోడ్డు కోసం యువజన సంఘాలు ప్రశ్నిస్తే ప్రభుత్వం వద్ద డబ్బు లేదని, నిధుల మంజూరుకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాజీనామా చేసి నిధుల మంజూరు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని సవాల్ విసిరారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, మాజీ జడ్పీటీసీలు సిద్ధం వేణు, మాడుగుల రవీందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గంప వెంకన్న, నాయకులు పి.లక్ష్మణ్, న్యాత సుధాకర్, విక్రమ్ రెడ్డి, జి.సురేశ్, తాడూరి వంశీకృష్ణారెడ్డి, అటికం శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
