- వాచ్‌మెన్లకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు కల్పించాలి: ఇబ్రాం శేఖర్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని అపార్ట్‌మెంట్లలో పనిచేస్తున్న వాచ్‌మెన్లు, జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ డిమాండ్ చేశారు. వారి హక్కులు, మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీఎస్పీ ప్రత్యేక కార్యాచరణ చేపడుతుందని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. నగర అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తున్న పేదలు, పారిశుధ్య కార్మికులు, వాచ్‌మెన్ల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
రాత్రింబవళ్లు పనిచేసే వాచ్‌మెన్లకు సరైన వేతనాలు, ఉద్యోగ భద్రత, పని గంటలు, విశ్రాంతి, కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. స్లమ్ ప్రాంతాల పేదలకు ఇళ్లు, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, పారిశుధ్యం, విద్య, వైద్యం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికుల ఉద్యోగ భద్రత, వేతనాలు, ఆరోగ్య రక్షణ, భద్రతా పరికరాలు, పని పరిస్థితులపై కార్యాచరణ చేపడతామని చెప్పారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి నివేదికలు తయారు చేసి అధికారులకు వినతిపత్రాలు ఇస్తామన్నారు.
అవసరమైతే ప్రజా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ‘‘ఎత్తైన భవనాలు, రోడ్లు కట్టడమే అభివృద్ధి కాదు. నగరాన్ని నిర్మిస్తున్న కార్మికుడు, కాపాడుతున్న వాచ్‌మెన్, శుభ్రం చేస్తున్న పారిశుధ్య కార్మికుడు, స్లమ్‌లోని పేద కుటుంబం గౌరవంగా బతికే పరిస్థితులు కల్పించినప్పుడే నిజమైన అభివృద్ధి’’ అని ఇబ్రాం శేఖర్ అన్నారు.
