నమ్మితే ఎంతపని చేశావురా.. ప్రియురాలి ప్రాణాలు తీసి డిక్కీలో కుక్కేశాడు.. కరీంనగర్లో ఘటన

నమ్మితే ఎంతపని చేశావురా.. ప్రియురాలి ప్రాణాలు తీసి డిక్కీలో కుక్కేశాడు.. కరీంనగర్లో ఘటన
  • ఎల్కతుర్తి ‘కారులో యువతి డెడ్​బాడీ’పై వీడిన మిస్టరీ
  • మృతురాలు గోదావరిఖనిలోని సెంటినరీ కాలనీకి చెందిన అంకతి మానస
  • కరీంనగర్​లో హత్య.. మృతదేహంతో ఎల్కతుర్తికి
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • నేడో, రేపో నిందితుడి  అరెస్ట్  చూపే అవకాశం

ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారు డిక్కీలో బయటపడిన యువతి డెడ్ బాడీ ఎవరిదో తేలింది. ప్రేమించిన యువతిని గొంతు పిసికి చంపేసి, కారులో తీసుకొచ్చి మృతదేహాన్ని పడేసే క్రమంలో ఆలస్యం కావడం, అంతలోనే దుర్వాసన వ్యాపించి అసలు విషయం బయటపడడంతో విచారణ చేపట్టిన పోలీసులు శుక్రవారం కీలక ఆధారాలు సేకరించారు. 

కారులో దొరికిన ఆధార్  కార్డు ఆధారంగా మృతురాలిని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సెంటినరీ కాలనీకి చెందిన అంకతి మానస(33)గా గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి, డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం వరంగల్  ఎంజీఎంకు తరలించారు.

కరీంనగర్ లో చంపి.. ఎల్కతుర్తికి..

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సెంటినరీ కాలనీకి చెందిన అంకతి మాసనకు గతంలో వివాహమైంది. ఆ తరువాత ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఇదిలాఉంటే మానస తండ్రి సింగరేణి ఎంప్లాయ్  కాగా, ఎల్కతుర్తికి చెందిన మిల్కూరి సమ్మిరెడ్డి అక్కడే పని చేసేవాడు. రెండు కుటుంబాల మధ్య పరిచయం ఉంది. 

ఈ క్రమంలో మానసకు. మిల్కూరి సమ్మిరెడ్డి రెండో కొడుకు వినోద్ రెడ్డితో పరిచయం పెరిగింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇదిలాఉంటే మూడు రోజుల కింద మానస, వినోద్ రెడ్డి కరీంనగర్ లోని వినోద్ రెడ్డికి చెందిన ఓ రూమ్ లో ఉన్నారు. 

అక్కడ వీరిద్దరి మధ్య గొడవ జరగగా, ఆవేశంలో వినోద్ రెడ్డి ఆమెను గొంతు పిసికి చంపేసి, డెడ్​బాడీని ఎక్కడైనా పాతి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. డెడ్ బాడీని మూటకట్టి కారు డిక్కీలో వేసుకొని ఎల్కతుర్తిలోని తన ఇంటి సమీపంలోకి తీసుకొచ్చాడు. 

కానీ, డెడ్ బాడీని ఎక్కడ పడేయాలో అర్థం కాక కారు డిక్కీలోనే ఉంచాడు. రెండు రోజులు డెడ్​బాడీ కారులోనే ఉండడంతో కుళ్లిపోయి దుర్వాసన వ్యాపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

కారు నెంబర్ ఆధారంగా..

ఘటనా స్థలాన్ని సెంట్రల్  జోన్  డీసీపీ దార కవిత, ఎల్కతుర్తి సీఐ పులి రమేశ్, ఎస్సై నర్సింహారావు శుక్రవారం   పరిశీలించారు. డెడ్ బాడీని కారులో నుంచి బయటకు తీసి క్లూస్ టీం, ఫోరెన్సిక్  నిపుణులతో వివరాలు సేకరించారు. 

కారులో దొరికిన ఆధార్  కార్డు ఆధారంగా మృతురాలిని గుర్తించి, కారు నెంబర్  ఆధారంగా కూపీ లాగారు. ఎల్కతుర్తిలోని తంగళ్లపల్లి సదానందానికి చెందిన కారును ఏడు నెలల కింద సమ్మిరెడ్డి పెద్ద కొడుకు భాస్కర్ రెడ్డి రూ.2 లక్షలకు తాకట్టు పెట్టుకోగా..  ఆ కారును వినోద్ రెడ్డి వాడుతున్నట్లు గుర్తించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. మానసను తానే హత్య చేసినట్లు వినోద్  ఒప్పుకున్నట్లు చెప్పారు.