యాదగిరిగుట్ట, వెలుగు : గ్రామీణ ప్రాంతాల్లోని భూ సంబంధిత సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరి అని, రెవెన్యూ, సర్వే అధికారులు సమన్వయంతో పనిచేయాలని యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో ఆయన ఆకస్మికంగా పర్యటించి భూ సంబంధిత వివరాలు, సర్వే రికార్డులను పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సరిహద్దు వివాదాలు, రికార్డుల్లోని వ్యత్యాసాలను నివారించేందుకు రెగ్యులర్ సర్వే రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ సుజాత, తహసీల్దార్ గణేశ్నాయక్, సర్వేయర్ దేవా నాయక్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
