ఉమ్మడి నల్గొండ జిల్లాలో వణుకు పుట్టిస్తున్న జువైనల్ క్రైమ్స్.. ఏడాదిలోనే 275 మంది మైనర్ల అరెస్ట్

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వణుకు పుట్టిస్తున్న జువైనల్ క్రైమ్స్.. ఏడాదిలోనే 275 మంది మైనర్ల అరెస్ట్
  • దొంగతనాలు, డ్రగ్స్ నుంచి రేపులు, హత్యల దాకా బరితెగింపు
  • కొండమల్లెపల్లి స్కూల్ కరస్పాండెంట్ హత్యతో పెరిగిన భయాందోళనలు
  • మద్యం, గంజాయి, జల్సాలకు అలవాటుపడి అడ్డదారులు
  • నేరాల్లో 60 శాతం మంది 16 నుంచి 18 ఏండ్ల లోపు వారే
  • పిల్లలపై కన్నేసి ఉంచాలంటున్న ఎస్పీలు 

నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో ‘జువైనల్ క్రైమ్స్’ వణుకు పుట్టిస్తున్నాయి. సరదాలు, జల్సాలకు అలవాటుపడి చిన్న వయసులోనే ఎక్కువ మంది మైనర్లు దొంగతనాలు, దాడులు ఏకంగా హత్యలు చేయడానికి కూడా తెగబడుతున్నారు. ఇటీవల కొండమల్లెపల్లిలో ప్రిన్సిపాల్ రూపా రెడ్డిని ఓ మైనర్ విద్యార్థే అత్యంత దారుణంగా హత్య చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘోర ఘటనతో మైనర్ల నేరాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 

ఏడాదిలో 275 మంది మైనర్లు..

గత 12 నెలల్లో ఉమ్మడి జిల్లాలో 215 కేసులకు సంబంధించి 275 మంది మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటే జువైనల్ క్రైమ్స్ ఏ స్థాయిలో పెరిగిపోయాయో స్పష్టమవుతోంది. దొంగతనాలు74, ఇతర నేరాలు 114, యాక్సిడెంట్ కేసులు 15, లైంగిక దాడులు 13, డ్రగ్స్, గంజాయి కేసులు10, దాడులు 7, చీటింగ్ కేసులు5, హత్యాయత్నం 3, హత్య కేసులు 2 నమోదయ్యాయి. ప్రస్తుతం నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన దాదాపు 300 కేసులు జువైనల్ జస్టిస్ బోర్డు ఎంక్వైరీ పరిధిలో ఉన్నట్లు సమాచారం.

మద్యం, జల్సాలతో నేరాలు 

నేరాలకు పాల్పడుతున్న వారిలో దాదాపు 60 శాతం మంది 16 నుంచి 18 ఏండ్ల వయస్సు ఉన్నవారే కావడం గమనార్హం. విలాసవంతమైన జీవితం గడపాలనే కోరిక, బైక్ రేసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, మద్యం, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు బానిసవుతుండటం వల్లనే మైనర్లు నేరాల వైపు మళ్లుతున్నారు. వ్యసనాలకు డబ్బులు సరిపోక దొంగతనాలకు అలవాటుపడుతున్నారు. నల్గొండ, మిర్యాలగూడ ప్రాంతాల్లో ఇటీవల వాహనాల దొంగతనాలకు పాల్పడిన 11 మంది బాలురను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఈ ట్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అద్దం పడుతోంది.

మేజర్లుగా పరిగణించలని డిమాండ్ 

మైనర్లు చేసే దారుణమైన నేరాలకు కేవలం 3 ఏండ్ల జువైనల్ హోమ్ శిక్ష సరిపోదని, 16 ఏండ్లు దాటిన వారిని మేజర్లుగా పరిగణించి విచారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ‘16 నుంచి-18 ఏండ్ల మధ్య ఉన్న మైనర్లు దారుణమైన హత్యలు, లైంగిక దాడుల వంటి నేరాలకు పాల్పడితే సైకాలజికల్ అసెస్మెంట్ ఆధారంగా వారిని మేజర్లుగా పరిగణించే అవకాశం ఉంది. అటువంటప్పుడు ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారించవచ్చు. ఇక్కడ దోషిగా తేలితే గరిష్టంగా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఉంది’ అని జువైనల్ జస్టిస్ బోర్డు మెంబర్ ఒకరు తెలిపారు.