- 28 ఏళ్ల ల్యాబ్ టెక్నీషియన్ మృతి.. 200 మందికి క్వారంటైన్
- 5 ఆస్పత్రులు క్లోజ్.. ఇర్కుట్స్క్‌లో బహిరంగ కార్యక్రమాలు రద్దు
- టెస్ట్ ట్యూబ్ పగలడంతో ఇన్‌ఫెక్షన్ సోకిందని ప్రచారం
మాస్కో: రష్యాలోని సైబీరియా ప్రాంతం ఇర్కుట్స్క్‌లో ప్లేగు కలకలం రేగింది. యాంటీ ప్లేగు రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేసే 28 ఏళ్ల ల్యాబ్ టెక్నీషియన్ దర్యా షిపిలోవా అనుమానాస్పద లక్షణాలతో అక్టోబర్ 1న చనిపోయారు. ల్యాబ్‌లో బ్యాక్టీరియాతో కూడిన టెస్ట్ ట్యూబ్ ప్రమాదవశాత్తు పగలడంతో ఆమెకు న్యుమోనిక్ ప్లేగు సోకి ఉండొచ్చని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ల్యాబ్‌లోని సహచరులు, ఆమెతో కాంటాక్ట్అయిన 200 మందిని క్వారంటైన్ చేశారు. అలాగే, ఇర్కుట్స్క్ సిటీలో బహిరంగ కార్యక్రమాలను స్థానిక ప్రభుత్వం రద్దు చేసింది. షిపిలోవా సెప్టెంబర్ 29న తీవ్రమైన న్యుమోనియా లక్షణాలతో షెలెఖోవ్‌లోని ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయితే, ప్లేగు వల్లే ఆమె చనిపోయినట్లు అధికారులు ఇప్పటివరకు నిర్ధారించలేదు. ఇర్కుట్స్క్ గవర్నర్ ఇగోర్ కొబ్జెవ్ తొలుత ఇది ‘అత్యంత ప్రమాదకరమైన ఇన్‌ఫెక్షన్’ కేసు కావచ్చని చెప్పారు. తర్వాత తెలియని కారణంతో వచ్చిన న్యుమోనియాగా పేర్కొన్నారు. షిపిలోవా శాంపిళ్లలో ఆమె వృత్తికి సంబంధించిన సూక్ష్మజీవులు కనిపించలేదని వెల్లడించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఇర్కుట్స్క్‌లోని ఐదు ఆస్పత్రులను మూసివేశారు.
రోగితో కాంటాక్ట్ అయిన వారందరినీ గుర్తించి వైద్యపరీక్షలు చేస్తున్నారు. వారికి రోజూ ల్యాబ్ పరీక్షలు నిర్వహిస్తూ వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. రష్యా వినియోగదారుల భద్రతా సంస్థ రోస్పోట్రెబ్నాడ్జోర్ అత్యవసర నియంత్రణ చర్యలు చేపట్టింది. అక్టోబర్ 2న గవర్నర్ కొబ్జెవ్ ఆ సంస్థ చీఫ్‌తో సమావేశమై పరిస్థితిపై సమీక్షించారు. పొరుగున ఉన్న బుర్యాతియా గవర్నర్ అలెక్సీ త్సిదెనోవ్ కూడా షిపిలోవా ప్లేగుతో చనిపోయి ఉండొచ్చని పేర్కొన్నా రు. అయితే, తమ ప్రాంతంలో ఎలాంటి ప్లేగు వ్యాప్తి లేదని స్పష్టం చేశారు. కాగా, 18, 19 వ శతాబ్దాలలో ప్లేగు మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. ఒక్క భారత్ లోనే సుమారు కోటికి పైగా జనం ఈ వ్యాధి కారణంగా మృత్యువాత పడ్డారు. 1960 తర్వాత ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ వ్యాధిని వైద్య నిపుణులు విజయవంతంగా కట్టడి చేశారు.
అమెరికా ట్రావెల్ అడ్వైజరీ
వాషింగ్టన్: రష్యాలో అనుమానిత ప్లేగు వ్యాధి మరణం చోటుచేసుకోవడంతో అమెరికా అప్రమత్తమైంది. ఇది శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ అని, సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా గాలి ద్వారా ఇతరులకు సులభంగా వ్యాపిస్తుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ కఠినమైన లెవల్-4 “డూ నాట్ ట్రావెల్” హెచ్చరికను జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా అక్కడ పర్యటించి ప్లేగు బారిన పడితే, అమెరికా ప్రభుత్వం వారిని స్వదేశానికి తరలించడం, వైద్య సదుపాయాలు కల్పించడం సాధ్యం కాదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది
