తమిళ, మలయాళ చిత్రాల్లో తనదైన నటనతో మంచి గుర్తింపును తెచ్చుకున్న మహిమా నంబియార్.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో శ్రీవిష్ణుకి జోడీగా నటించింది. జానకిరామ్ మారెళ్ల దర్శకుడు. కోన వెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించారు. అక్టోబర్ 9న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మహిమా నంబియార్ ఇలా మాట్లాడింది.
‘ఈ సినిమాతో తెలుగులో డెబ్యూ చేయడం లక్కీగా ఫీలవుతున్నా. ఇందులో నాది చాలా ఫన్ క్యారెక్టర్. నా పాత్ర పేరు సితార దేవి. పక్కింటి అమ్మాయిలా చాలా ఇన్నోసెంట్‌గా ఉంటుంది. ఒరిస్సా నుంచి వచ్చిన అమ్మాయిగా కనిపిస్తాను. ఆ భాష కారణంగా హీరో, హీరోయిన్ మధ్య వచ్చే ఫన్ చాలా గమ్మత్తుగా ఉంటుంది. నక్సలిజం బ్యాక్‌డ్రాప్ సినిమా అయినప్పటికీ చాలా కామికల్‌గా డీల్ చేశారు. శ్రీవిష్ణు చాలా స్పాంటేనిటీ ఉన్న యాక్టర్. షూటింగ్ స్పాట్‌లో చాలా ఇంప్రొవైజ్ చేస్తుంటారు. అది నాకు మరింత ఛాలెంజింగ్‌గా అనిపించింది.
ఆయనకి ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంది. ఆయనతో కలిసి నటించడం మంచి ఎక్స్‌పీరియన్స్. తెలుగులో నటించడం నాకు సరికొత్త అనుభవం. ఇప్పటికే తమిళ, మలయాళ భాషల్లో నటించా. నేను ఏ భాషనైనా చాలా త్వరగా, ఈజీగా నేర్చుకుంటా. తమిళం మాట్లాడటమే కాక రాయడం కూడా నేర్చుకున్నా. తెలుగు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. భాష వచ్చినప్పుడే ఆ పాత్ర ఎమోషన్‌ను మరింత పండించగలుగుతాం. ఇక ఓ నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. ప్రస్తుతం తమిళ, మలయాళంతోపాటు తెలుగులో కూడా కథలు వింటున్నా’ అని చెప్పింది.
