- కెమికల్ ఇండస్ట్రీస్‌పై నిఘా.. అనుమతి లేని రియాక్టర్ల లీజుపై కఠిన చర్యలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో సింథటిక్, డిజైనర్ డ్రగ్స్ తయారీ, ప్రీకర్సర్ రసాయనాల అక్రమ మళ్లింపును అడ్డుకునేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా బంజారాహిల్స్‌లోని ఈగల్ ఫోర్స్ ప్రధాన కార్యాలయంలో ఆ శాఖ డైరెక్టర్ సందీప్ శాండిల్య అధ్యక్షతన వివిధ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం సమావేశం జరిగింది.
నార్కోటిక్స్ కంట్రోల్ 2026–29 విజన్ డాక్యుమెంట్‌లోని నాలుగు స్తంభాల వ్యూహంలో భాగంగా ఈ సమావేశం నిర్వహించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్, ప్రీకర్సర్, సింథటిక్ డ్రగ్స్ నియంత్రణ, డిమాండ్ , హార్మ్ రిడక్షన్, అలాగే సామర్థ్య పెంపు -సమన్వయం అనే నాలుగు ప్రధాన అంశాలపై కార్యాచరణ రూపొందించారు.
రియాక్టర్ల లీజుపై ప్రత్యేక నిఘా
రసాయన, ఫార్మా సంస్థలు తమ రియాక్టర్లు, తయారీ మౌలిక వసతులను అనధికార వ్యక్తులకు లేదా సంస్థలకు అద్దెకు ఇస్తే కఠిన చర్యలు తప్పవని సమావేశంలో స్పష్టం చేశారు. బీబీనగర్ మండలం కొండమడుగులోని వేటుకూరి ల్యాబ్స్‌లో అక్రమంగా మెఫెడ్రోన్ తయారీ, మౌలాలిలోని ఎస్‌ఎం ల్యాబ్స్‌లో ఆల్ప్రాజోలం తయారీ కేసుల దర్యాప్తులో కొందరు రియాక్టర్లను లీజుకు తీసుకుని ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
అందువల్ల రసాయన, ఫార్మా పరిశ్రమలన్ని 'వలంటరీ కోడ్ ఆఫ్ కండక్ట్ (వీసీసీ)'ను తప్పనిసరిగా పాటించేలా వాటి యాజమాన్యాలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. బొల్లారం, జిన్నారం, చెర్లపల్లి, జీడిమెట్ల, పాశమైలారం, బాలానగర్, యాదాద్రి-భువనగిరి, పటాన్‌చెరు తదితర పారిశ్రామిక ప్రాంతాల్లోని కెమికల్, ఫార్మా సంస్థలతో త్వరలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు.
