సింగరేణి కార్మికులకు 35 శాతం బోనస్ ఇవ్వాలి..కంపెనీకి బకాయిపడ్డ రూ.60 వేల కోట్లు చెల్లించాలి: కవిత

సింగరేణి కార్మికులకు 35 శాతం బోనస్ ఇవ్వాలి..కంపెనీకి బకాయిపడ్డ రూ.60 వేల కోట్లు చెల్లించాలి: కవిత
  • హైదరాబాద్‌‌‌‌లోని సింగరేణి భవన్ ముందు బైఠాయింపు
  • 2 నెలల్లో సమస్యలు తీర్చకుంటే ఆమరణ దీక్ష చేస్తానని వార్నింగ్

హైదరాబాద్, వెలుగు: సింగరేణి సంస్థలో వెంటనే లాభాల ప్రకటన చేసి, కార్మికులకు 35 శాతం బోనస్ వాటా ఇవ్వాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అలియాస్ పేర్లతో ఉద్యోగాలు చేస్తున్న వారి వారసులకు కొలువులు ఇవ్వకుండా విజిలెన్స్ విచారణ పేరుతో వేధిస్తున్నారని, ఇలా అక్రమంగా తొలగించిన వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలన్నారు. 

సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.60 వేల కోట్ల బకాయిలు పెట్టిందని, నిధులు ఇవ్వకపోవడం వల్లే సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నందున వెంటనే చెల్లించాలని డిమాండ్​చేశారు. సోమవారం హెచ్ఎంఎస్, తెలంగాణ రక్షణ సేన నాయకులతో కలిసి ఆమె లక్డీకాపూల్‌‌‌‌లోని సింగరేణి భవన్ ముందు బైఠాయించారు. రాష్ట్రంలో సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను రెండు నెలల్లోగా పరిష్కరించకపోతే హైదరాబాద్‌‌‌‌లోని సింగరేణి భవన్ ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు.

 మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులందరినీ అన్ ఫిట్ చేసి, వారి వారసులకు వెంటనే డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాలని, కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 
యాజమాన్యం తరపున ఉన్నతాధికారులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. సింగరేణి సీఎండీ మీటింగ్‌‌‌‌లో ఉన్నారని, ఆయన ఆదేశాలతోనే తాము చర్చలకు వచ్చామని అధికారులు తెలిపారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 

దీనిపై స్పందించిన కవిత.. సమస్యల పరిష్కారానికి యాజమాన్యానికి రెండు నెలల సమయం ఇస్తున్నామని, అప్పటివరకు స్పందించకపోతే సింగరేణి భవన్ గేటు ఎదుటే ఆమరణ దీక్ష చేపడతానని తేల్చిచెప్పారు. కాగా సింగరేణి సంస్థ నేడు ద్రోహుల చేతుల్లో బందీ అయిందని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు.