హైదరాబాద్, వెలుగు: రోడ్లపై ఆక్రమణలను అనుమతిస్తూ పోతే చివరకు రోడ్లు, జాతీయ, రాష్ట్ర రహదారులు, నదులు, చెరువులు, కుంటలు ఏవీ మిగలవని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఖమ్మం జిల్లా శ్రీనివాసనగర్ పారిశ్రామిక ప్రాంతంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డు ఆక్రమణలతో 40 అడుగులకు కుంచించుకుపోవడంపై తీవ్రంగా స్పందించింది. ఆక్రమణదారులకు చట్టంపై అవగాహన లేకపోవచ్చని అధికారులు చెబుతున్నారని, మరి చట్టాన్ని అమలు చేయాల్సిన యంత్రాంగం దశాబ్దాలుగా ఏం చేసిందని ప్రశ్నించింది.
శ్రీనివాసనగర్ టింబర్ మార్కెట్ ఇండస్ట్రియల్ ఏరియా వెల్ఫేర్ అసోసియేషన్ 2013లో దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం విచారించింది. అక్కడ 680 కుటుంబాలు, 2,000 మంది నివసిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఆక్రమణలకు పట్టాలు, విద్యుత్ కనెక్షన్లు ఎలా ఇచ్చారని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేసింది. ఆక్రమణల తొలగింపుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. శాంతిభద్రతల సమస్య ఉంటే ఖమ్మం డీఐజీతో సంప్రదించి పోలీసు భద్రత తీసుకోవాలని సూచించింది V
