హైజాక్ కోసమే కొలువు..ఫ్లై దుబాయ్ ఘటనలో బయటపడ్డ ఉగ్ర కోణం

హైజాక్ కోసమే కొలువు..ఫ్లై దుబాయ్ ఘటనలో బయటపడ్డ ఉగ్ర కోణం
  • 9/11 తరహాలో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టాలని కుట్ర
  • టెల్ అవీవ్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టుపై కూల్చేయాలని ప్లాన్

దుబాయ్: ఫ్లై దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విమానంలో జరిగిన దాడికి సంబంధించి పలు కీలక విషయాలు బయటపడుతున్నాయి. గత వారం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న ‘ఫ్లైదుబాయ్’ విమానంలో కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గొడ్డలితో దాడి చేసి, విమానాన్ని కూల్చేందుకు యత్నించిన కో-పైలట్.. ఈ దారుణాన్ని ఉద్యోగంలో చేరకముందే పక్కాగా ప్లాన్ చేసినట్టు తేలింది. యూఏఈ దర్యాప్తు సంస్థల విచారణలో సదరు నిందితుడు విస్తుపోయే వాస్తవాలు వెల్లడించినట్టు ఇజ్రాయెల్ ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. గత బుధవారం  ‘ఫ్లై దుబాయ్ ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1073’ విమానంలో ఈ ఘాతుకం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నిందితుడిని ఒమన్ దేశానికి చెందిన హమామ్ అల్-హమ్మామీగా గుర్తించారు. 9/11తరహాలో టెల్ అవీవ్ సమీపంలోని ఓ ఎత్తైన భవనాన్ని ఢీకొట్టాలని, బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంపై విమానాన్ని కూల్చేయాలన్నదే తన లక్ష్యమని అతడు ఒప్పుకున్నాడు.

జులైలోనే దాడికి ప్లాన్ 

ఇజ్రాయెల్ మీడియా కథనాల ప్రకారం.. హమ్మామీ ఈ దాడిని వాస్తవానికి ఈ ఏడాది జులై నెలలోనే చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే, ఆ సమయంలో విమానంలో ఉన్న సిబ్బందిలో ఒకరు తనకు  మంచి స్నేహితుడు కావడంతో చివరి నిమిషంలో దాడిని విరమించుకొని.. వాయిదా వేశాడు. విమానయాన సంస్థలో చేరడానికి ముందే టెల్ అవీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సర్వీసులు నడిపే ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్ గురించి ఆరా తీసి, పక్కా ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే ఫ్లైదుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరినట్టు నిందితుడు తెలిపాడు. జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెక్కీ నిర్వహించి ల్యాండింగ్ క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఎలా తీసుకోవాలో గమనించినట్టు పేర్కొన్నాడు. ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాకపోకలు సాగించే విమానయాన సంస్థల కోసం వెతికి మరీ.. పథకం ప్రకారమే దుబాయ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫ్లైదుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నట్టు విచారణలో తేలింది.

అంతర్జాతీయ స్థాయిలో విచారణ ముమ్మరం

ఈ ఘటనను యూఏఈ ప్రాసిక్యూటర్ జనరల్ ‘ఉగ్రవాద దాడి’గా ప్రకటించారు. నిందితుడిని సౌదీ భద్రతా దళాలు అదుపులోకి తీసుకొని అనంతరం యూఏఈకి అప్పగించాయి. కాగా, దౌత్య సంబంధాలు లేని దేశాల పైలట్లకు ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో విధులు ఎలా కేటాయించారనే దానిపై సమగ్ర విచారణకు ఆదేశించినట్టు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. మరోవైపు, నిందితుడు గతంలో మెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఐటీ యూనివర్సిటీలో చదువుకున్న నేపథ్యం ఉండటంతో, ఆస్ట్రేలియా ఉగ్రవాద నిరోధక దళాలు కూడా అతని పాత నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దృష్టి సారించాయి.  

కో పైలట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మరణశిక్ష విధించాలని యూఏఈ నిర్ణయం
కో-పైలట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హమామ్ అల్ -హమ్మామీకి మరణశిక్ష విధించే అవకాశం ఉందని  యూఏఈ ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. ఈమేరకు ఇజ్రాయెలీ మీడియా సంస్థ ‘వై-నెట్’ కథనం ప్రచురించింది. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అందరినీ అంతమొందించేందుకు ప్రయత్నించిన ఉగ్రవాది హమ్మామీకి చట్టపరంగా అత్యంత కఠినమైన శిక్ష (ఉరిశిక్ష) విధించాలని అబుదాబి యోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు, ఈ కుట్ర వెనుక ఉన్న లోతైన అంశాలను వెలికితీసేందుకు ఇజ్రాయెల్ నిఘా విభాగం అధికారులు ప్రస్తుతం యూఏఈకి చేరుకున్నారు.