- 7.5 తులాల ఆభరణాలు స్వాధీనం
గచ్చిబౌలి, వెలుగు: ఉదయం గుడికి వెళ్లిన దంపతులు సాయంత్రం ఇంటికి తిరిగొచ్చేసరికి బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన రాయదుర్గం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సీసీ ఫుటేజీ, సెల్ఫోన్సిగ్నల్స్ఆధారంగా 3 గంటల్లోనే దొంగతనం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్చేశారు. మణికొండ శివపురి కాలనీకి చెందిన మాధురి గురువారం ఉదయం తన భర్తతో కలిసి ఆలయానికి వెళ్లింది.
సాయంత్రం 6.30 గంటలకు ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి బీరువాలో చూడగా.. 7.5 తులాల రెండు గోల్డ్చైన్లు, రెండు బ్రాస్లెట్లు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని నిర్ధారించుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనాస్థలికి చేరుకొని సీసీ ఫుటేజీ చెక్చేయగా ఓ మహిళ యువకుడితో కలిసి చోరీ చేసినట్లు తేలింది.
బాధితుల ఇంటి సమీపంలోనే ఓ మహిళ అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. మణికొండ మర్రిచెట్టు ప్రాంతంలో నివాసం ఉండే లక్ష్మి అని, దొంగతనం చేసినట్లు ఒప్పుకుంది. తన బంధువు రాయదుర్గంలోని ఓ ప్రైవేట్హాస్టల్ సెక్యూరిటీ గార్డు శివ రాఘవేంద్రతో కలిసి చోరీ చేశానని తెలిపింది. నిందితుల వద్ద నుంచి ఆభరణాలు స్వాధీనం చేసుకొని, ఇద్దరినీ అరెస్ట్చేసినట్లు సీఐ భూపతి తెలిపారు. లక్ష్మి గతంలోనూ రాయదుర్గంలోని ఓ ఇంట్లో పని మనిషిగా చేస్తూ దొంగతనానికి పాల్పడిందని పేర్కొన్నారు.
