రఘునాథపల్లి (జఫర్‌గడ్), వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం, తనపై బీఆర్‌ఎస్ నాయకులు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. శుక్రవారం జనగామ జిల్లా రఘునాథపల్లి, జఫర్‌గడ్ మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో నిర్వహించిన కొత్త డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఆదిలాబాద్‌లో సంజీవరెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన వివాదాన్ని తనకు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లను బీఆర్‌ఎస్ ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులపై సంబంధంలేని వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు గాదే మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
