- ఇతర రాష్ట్రాల విద్యార్థులతో మన బిడ్డలకు అన్యాయమవుతున్నదని ఫైర్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్థానిక విద్యార్థులకే రాష్ట్రంలోని ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ (టీఆర్ఎస్) కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. 2024లో ప్రభుత్వం తెచ్చిన 150 జీవో వల్ల ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఎక్కువ సీట్లు దక్కుతున్నాయని, తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని టీఆర్‌ఎస్ ఆఫీసులో నీట్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులు కవితను కలిశారు. త్వరలో సీట్ల కేటాయింపు జరగనున్నందున స్థానిక విద్యార్థులకు నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
వచ్చే విద్యా సంవత్సరం నాటికి 150 జీవోను రద్దు చేసి, పాత స్థానికత విధానాన్ని పునరుద్ధరించాలని కవిత డిమాండ్ చేశారు. ఏటా సుమారు 1,500 నుంచి 2 వేల సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకే దక్కుతున్నాయని పేర్కొన్నారు. నీట్ కారణంగా ఇప్పటికే 15 శాతం సీట్లు కోల్పోతున్నామని, ఏ రాష్ట్రంలో మెడికల్ సీట్ల భర్తీకి ఆ రాష్ట్రమే ఎంట్రన్స్ నిర్వహిస్తే సీట్లు కోల్పోవాల్సిన ఆస్కారమే ఉండదన్నారు. తెలంగాణలో విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని కవిత ప్రశ్నించారు. ఢిల్లీలో ఒక న్యాయం.. తెలంగాణలో మరో న్యాయమా అని ‘ఎక్స్’లో నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో రాహుల్ మౌనం వహించడం బాధ కలిగిస్తోందని విమర్శించారు.
