- బీసీ, ఓబీసీ కాలమ్ లేకుండా సరైన లెక్కలు ఎలా వస్తయ్: రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఓబీసీ కులాలకు పారదర్శకమైన, శాస్త్రీయమైన ప్రత్యేక కోడింగ్ విధానాన్ని ఖరారు చేసే వరకు ‘జనగణన–2027’లో కులగణన ప్రక్రియను వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్, బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రత్యేక ఓబీసీ కోడ్‌లు, డ్రాప్‌డౌన్ జాబితా లేకుండా నిర్వహించే కులగణన వల్ల బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఆలిండియా బీసీ ఇంటలెక్చువల్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ‘ఓపెన్ కాస్ట్ కాలమ్, క్లోజ్డ్ జస్టిస్, జనగణన–2027లో అన్యాయం’అనే అంశంపై ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్‌తో ముఖాముఖి, రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమాలు, సామాజిక సంఘాల ఒత్తిడి తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం అరకొర మనసుతో కులగణన ప్రకటించిందని విమర్శించారు.
2011 సామాజిక-ఆర్థిక కులగణన (ఎస్‌ఈసీసీ)లో ఓపెన్ ఎండెడ్ పద్ధతి వల్ల దేశంలో 46 లక్షలకు పైగా కులాల పేర్లు నమోదయ్యాయన్నారు. ఒకే కులానికి వేర్వేరు స్పెల్లింగ్‌లు, ప్రాంతీయ పేర్లు రాయడంతో ఆ డేటాను క్రోడీకరించలేక సమాచారాన్ని తొక్కిపెట్టారని, మళ్లీ ఇప్పుడు 2027 జనగణనలోనూ కులం పేరును ఎవరికివారే రాసుకునేలా ఓపెన్ కాస్ట్ కాలమ్ పెట్టడం గందరగోళానికి దారితీస్తుందని చెప్పారు. కులగణనలో ప్రతి కులాన్ని లెక్కించాలని, ప్రతి గుర్తింపు పొందిన కులానికి ప్రత్యేక కోడ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఓబీసీలకూ ప్రత్యేక కోడ్ ఇవ్వాలి: టి.చిరంజీవులు
దేశంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇప్పటికే గుర్తింపు పొందిన కులాల జాబితాలు, కోడింగ్ వ్యవస్థ ఉందని, అదే విధానాన్ని ఓబీసీలకు ఎందుకు వర్తింపజేయడం లేదని బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ టి.చిరంజీవులు ప్రశ్నించారు. ప్రత్యేక బీసీ, ఓబీసీ కాలమ్ లేకుండా సరైన లెక్కలు ఎలా వస్తాయన్నారు. నిపుణుల కమిటీ వేసి మార్గదర్శకాలు ఖరారు చేసే వరకు గణనను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ నేత బలరాజ్ గౌడ్, బ్యాక్‌వర్డ్ కాస్ట్స్ ఫెడరేషన్ నేత చిన్నరాములు ముదిరాజ్, సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షుడు చమకూర రాజు, బీసీ లాయర్స్ అసోసియేషన్ నేత పొన్నం దేవరాజ్ గౌడ్, ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
