- సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలిపివేసిన ధర్మాసనం
- సోమవారం నుంచి ప్రక్రియ ప్రారంభం
హైదరాబాద్: సింగిల్ జడ్జి ఉత్తర్వులతో నిలిచిపోయిన రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియను కొనసాగించడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియపై సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు పూర్తయినా తాత్కాలిక కమిటీ ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియ చేపట్టడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారించిన సింగిల్ జడ్జి గతంలో స్టే విధించారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ న్యాయవిద్య పూర్తి చేసిన అభ్యర్థి అప్పీలు దాఖలు చేశారు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. న్యాయశాస్త్రంలో పట్టా పొందిన విద్యార్థులకు బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్ అయ్యే హక్కు ఉందని, దీనికి ఎన్నికలతో సంబంధం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. తాత్కాలిక కమిటీ ఆధ్వర్యంలో ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియను యథావిధిగా కొనసాగించవచ్చని తేల్చిచెప్పింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సోమవారం నుంచి ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియను పునఃప్రారంభించనున్నట్లు బార్ కౌన్సిల్ వెల్లడించింది
