Netherlands vs India Hockey: మెన్స్ హాకీ వరల్డ్ కప్ సెకండ్ రౌండ్‌లో భారత్ ముందర మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్ వచ్చి పడింది. పూల్-ఈ లో భాగంగా నేడు (ఆగస్టు 22, శనివారం) ఒలింపిక్ ఛాంపియన్ నెదర్లాండ్స్‌తో వాగనర్ స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకి టీమిండియా తలపడనుంది. ఇప్పటికే మొదటి రౌండ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడంతో భారత్‌కు ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిన డూ ఆర్ డై పరిస్థితిగా మారింది. ఈ మ్యాచులో ఓడిపోతే ఇండియా సెమీస్ ఆశలు దాదాపు గాల్లో కలసిపోవడం ఖాయం కాగా, గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ రేసులో నిలుస్తుంది. గతంలో నెదర్లాండ్స్‌ను ఓడించిన రికార్డు భారత్‌కు ఉన్నప్పటికీ, సెకండ్ హాఫ్‌లో డిఫెన్స్ బలహీనపడటం టీమిండియాను తీవ్రంగా కలవరపెడుతోంది. మరి ఈ హై-ప్రెజర్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన సంచలనం సృష్టించి డచ్ టీమ్‌ను చిత్తు చేస్తుందో లేదో ఇప్పుడు చూద్దాం..
డూ ఆర్ డై మ్యాచ్.. లీగ్ రౌండ్ రూల్స్‌తో ఊహించని ట్విస్ట్!
కొత్త హాకీ ఫార్మాట్ ప్రకారం మొదటి రౌండ్లో తలపడిన జట్లు సెకండ్ రౌండ్లో మళ్లీ ఆడవు, కానీ ఆ పాత మ్యాచ్ రిజల్ట్ ఇక్కడి పాయింట్ల పట్టికకు యాడ్ అవుతుంది. ఈ లెక్కన ఇంగ్లాండ్ చేతిలో ఓటమితో ఇండియా ప్రస్తుతం పూల్-ఈ లో ఒక ఓటమితో మూడో స్థానంలో కొనసాగుతుంది. కాబట్టి నేడు నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌లోనూ, ఆ తర్వాత అర్జెంటీనాతో జరిగే మ్యాచ్‌లోనూ టీమిండియా కచ్చితంగా గెలవాల్సిందే.. ఒకవేళ ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోతే, ఇంగ్లాండ్ తమ తర్వాతి రెండు మ్యాచ్‌లలో ఓడిపోవాలని, అలాగే ఇండియా అర్జెంటీనాపై భారీ గోల్స్ తేడాతో గెలవాలని ప్రార్థించాల్సిందే.
ప్రో లీగ్ విక్టరీనే భారత్ హోప్:
మరోవైపు ప్రత్యర్థి నెదర్లాండ్స్ ఫుల్ ఫామ్‌లో ఉంది. మొదటి రౌండ్‌లో న్యూజిలాండ్, అర్జెంటీనా, జపాన్‌లను చితక్కొట్టి పాయింట్ల టేబుల్‌లో అగ్రస్థానాల్లో కొనసాగుతోంది. కానీ భారత్‌కు ఉన్న ఒక్కగానొక్క బిగ్ కాన్ఫిడెన్స్ ఏంటంటే.. ఈ ఏడాదే జూన్‌లో జరిగిన హాకీ ప్రో లీగ్‌లో నెదర్లాండ్స్‌ను 3–2 తేడాతో టీమిండియా మట్టికరిపించింది. ఆ రోజు గోల్స్ కొట్టిన జుగ్‌రాజ్ సింగ్, అభిషేక్, రాజిందర్ సింగ్‌లు ప్రస్తుతం వరల్డ్ కప్ టీమ్‌లోనూ ఉండటం భారత్‌కు పెద్ద అసెట్.
సెకండ్ హాఫ్‌లో వీక్‌నెసే ఇండియాకు పెద్ద మైనస్:
ప్రస్తుతం టీమిండియాకు అతిపెద్ద తలనొప్పి ఏదైనా ఉందంటే అది మ్యాచ్ సెకండ్ హాఫ్‌లో డిఫెన్స్ వికెట్ పడిపోవడమే.. పాకిస్తాన్‌పై 3–0, 4–1 లీడ్ సాధించగా ఆఖర్లో గోల్స్ సమర్పించుకుని 5–3తో ముగించింది. ఇంగ్లాండ్‌పై కూడా హాఫ్ టైమ్ వరకు 2–1తో లీడ్‌లో ఉండి థర్డ్ క్వార్టర్లో రెండు గోల్స్ ఇచ్చేసి 2–4తో మ్యాచ్ పోగొట్టుకుంది. ఈ టోర్నీలో ఇప్పటికే 5 గోల్స్ కొట్టిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. డీప్ డిఫెన్స్‌లో తప్పులు సరిదిద్దుకోకపోతే డచ్ వంటి స్ట్రాంగ్ టీమ్ శిక్షిస్తుందని, 25 మీటర్ల ఏరియాలో బాల్ దొరికితే గోల్‌గా మార్చాల్సిందేనని హెచ్చరించాడు. మరి ఈ సవాలును అధిగమించి మనవాళ్లు ఈరోజైనా కంబ్యాక్ ఇస్తారో లేదో చూడాల్సింది.
