న్యూఢిల్లీ: ఇండియా స్టార్ షట్లరు ట్రీసా జాలీ–గాయత్రి గోపీచంద్.. వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సంచలనం సృష్టించారు. శుక్రవారం జరిగిన విమెన్స్ డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో అన్‌సీడెడ్ ట్రీసా–గాయత్రి 16–21, 21–15, 21–13తో నాలుగోసీడ్ జియా యి ఫాన్–జాంగ్ షు జియాన్ (చైనా)పై గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించారు.
దాంతో మెగా టోర్నీలో కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకున్నారు. విమెన్స్ డబుల్స్‌లో చివరిసారిగా ఇండియా 2011లో వరల్డ్ చాంపియన్‌షిప్ మెడల్‌ను గెలిచింది. లండన్‌లో జరిగిన ఆ టోర్నీలో జ్వాలా గుత్తా–అశ్విని పొన్నప్ప బ్రాంజ్ మెడల్‌ను సొంతం చేసుకున్నారు. 2022, 2023లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లోనూ సెమీస్ చేరిన ట్రీసా–గాయత్రి.. 2022 కామన్వెల్త్‌లో బ్రాంజ్‌ను సాధించారు.
తొలి గేమ్ చేజారినా..
చైనీస్ ప్రత్యర్థులతో ముఖాముఖి రికార్డులో 0–3తో వెనకబడిన ట్రీసా–గాయత్రి ఈ మ్యాచ్‌లో అద్భుతంగా పోరాడారు. గంటా 10 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో ఇండియన్ జోడీ తొలి గేమ్‌ను చేజార్చుకుంది. 1–6తో వెనకబడినప్పటికి వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 8–9తో నిలిచారు.
అయినా బ్రేక్ టైమ్‌కు ఫాన్–జియాన్ మూడు పాయింట్ల ఆధిక్యంలో నిలిచారు. బ్రేక్ తర్వాత అద్భుతమైన ర్యాలీలు ఆడిన ట్రీసా–గాయత్రి 13–15తో నిలిచినా.. చైనీస్ జోడీ దూకుడు ముందు నిలవలేకపోయారు. ప్రత్యర్థులు వరుసగా పాయింట్లు సాధించి ఈజీగా గేమ్‌ను సొంతం చేసుకున్నారు. రెండో గేమ్‌లో వ్యూహాత్మకంగా ఆడిన ట్రీసా–గాయత్రి 5–1, 10–7, 13–10, 15–14తో దూసుకుపోయారు. ఈ దశలో వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 19–14 ఆధిక్యంలో నిలిచి గేమ్‌ను గెలిచారు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ట్రీసా–గాయత్రి మరింత దూకుడుగా ఆడారు.
ఫలితంగా 11–5తో ముందంజ వేశారు. ఇక్కడి నుంచి వరుసగా పాయింట్లు నెగ్గి 14–7కు పెంచారు. ఈ క్రమంలో ట్రీసా ఒక షాట్‌ను నెట్‌కు కొట్టడం, గాయత్రి సర్వీస్ తప్పిదం చేయడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. కానీ చైనా ప్లేయర్లు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మల్చుకోలేకపోయారు.
చివరకు 15–9 వద్ద వరుసగా నాలుగు ఆ తర్వాత రెండు పాయింట్లు గెలిచి చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకున్నారు. మెన్స్ డబుల్స్ క్వార్టర్స్‌లో ఐదో సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి 18–21, 9–21తో మూడోసీడ్ లియాంగ్ వీ కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) చేతిలో కంగుతిన్నారు. 36 నిమిషాల మ్యాచ్‌లో ఇండియన్ ప్లేయర్లు అన్ని రంగాల్లో తేలిపోయారు. తొలి గేమ్‌లో కాస్త పోటీ ఇచ్చినా.. రెండో గేమ్‌లో ఘోరంగా నిరాశపర్చారు.
