ఆమ్‌స్టెల్విన్: హాకీ వరల్డ్ కప్ రెండో రౌండ్ మ్యాచ్‌లకు ఇండియా మెన్స్ జట్టు రెడీ అయ్యింది. శనివారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఒలింపిక్ చాంపియన్ నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఇండియా సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆడి గెలవాలి.
ఇది జరగాలంటే ఆరంభం నుంచి మెరుగైన ప్రదర్శన చూపెట్టాలి. ఎందుకంటే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో స్టార్టింగ్‌లో బాగా ఆడిన ఇండియా చివర్లో తడబడింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ తొలి హాఫ్‌లో ఆధిక్యంలో ఉండి కూడా చివరకు ఓటమిపాలైంది. ఈ బలహీనతను సరిదిద్దుకోవడంపై హర్మన్‌ప్రీత్ బృందం ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉంది. పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడంలోనూ ప్లేయర్లు కీలక పాత్ర పోషించాలి.
మరోవైపు నెదర్లాండ్స్ లీగ్ దశలో న్యూజిలాండ్, అర్జెంటీనా, జపాన్ జట్లపై అద్భుత విజయాలు సాధించి జోరు మీదుంది. వాజెనర్ స్టేడియంలో వేలాది మంది స్థానికుల మధ్య ఆడటం డచ్‌కు కలిసొచ్చే అంశం. అయితే గతేడాది రోటర్‌డ్యామ్‌లో జరిగిన ప్రో లీగ్ మ్యాచ్‌లో ఇండియా 3–2తో నెదర్లాండ్స్‌ను ఓడించింది.
ఆ మ్యాచ్‌లో రాణించిన జుగ్‌రాజ్ సింగ్, అభిషేక్, రాజిందర్ సింగ్ ఈ వరల్డ్ కప్ జట్టులోనూ ఉండటం ఇండియాకు సానుకూలాంశం. ఈ కీలక మ్యాచ్‌లో ఇండియా డిఫెన్స్ పటిష్టంగా ఉండటంతో పాటు డచ్ ఒత్తిడిని అధిగమిస్తేనే విజయాన్ని ఆశించొచ్చు.
