వెలుగు ఓపెన్ పేజీ.. కమల నాథులది కలవరమా? వ్యూహమా?

వెలుగు ఓపెన్ పేజీ.. కమల నాథులది కలవరమా? వ్యూహమా?

తెలంగాణ  రాజకీయాలకు  సంబంధించి  బీజేపీ  కేంద్ర  నాయకత్వానిది లోతైన  వ్యూహమా?  పాలుపోని స్థితా?  తెలియటం లేదు.  సొంతంగానే  ఎదిగి  అధికారంలోకి రావాలా?  ఎవరితోనైనా పొత్తులతో కాంగ్రెస్‌‌‌‌ను  కట్టడి చేయాలా?  తేల్చుకోలేకపోతున్నట్టుంది.   ప్రస్తుత పార్టీ  జాతీయ కార్యవర్గంలో తెలంగాణవారెవరికీ చోటు దక్కలేదు.  కానీ, కేంద్ర మంత్రివర్గంలో మరింత ప్రాతినిధ్యం లభిస్తుందని తెలంగాణ సీనియర్ నేత  డా.లక్ష్మణ్ అంటున్నారు.  

రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి పలు ప్రయత్నాలు చేస్తున్నా అధిష్టానానికి  ఇంకా నమ్మకం  కుదురుతున్నట్టు లేదు.  వీలయితే  సొంతంగానే ఎదిగి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, అది సాధ్యపడదనుకున్నప్పుడు ‘తగిన’వారితో కూడి కాంగ్రెస్‌‌‌‌ను  కట్టడి చేయడం బీజేపీ ఫార్ములా.  అటుపక్క ‘మహారాష్ట్ర’,  ఇటుపక్క ‘ఏపీ’ నమూనాలు ఉండనే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌‌‌‌లో ఘనవిజయం తర్వాత పార్టీ ‘తదుపరి లక్ష్యం తెలంగాణయే’ అని పార్టీ అధ్యక్షుడు  నితిన్ నబీన్, అంతకుముందు ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చి మరీ చెప్పారు.  కానీ, పార్టీ గ్రాఫ్  తెలంగాణలో అలా పెరుగుతున్నట్టు లేదు. అందుకు రాష్ట్రంలో పార్టీ నాయకత్వం ప్రధాన కారణమైతే  కేంద్ర నాయకత్వం కూడా ఎంతోకొంత కారణమే అని వారి చర్యలు, నిర్ణయాలు చెబుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో  పార్టీ  పరిస్థితిపై  బీజేపీ కేంద్ర  నాయకత్వం  నిర్ధిష్ట చర్యల ద్వారా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని బుజ్జగించి కొన్నిమార్లు, బెదిరించి పలుమార్లు చెప్పి చూశారు.  కానీ, ఆశించిన ఫలితం కనిపించడం లేదు. తెలంగాణ బీజేపీ ముఖ్య నాయకులతో భేటీలో ‘మీరు ఎన్ని రోజులు ఈ పార్టీలో ఉంటారో తెలియదు. ఉన్నన్ని రోజులయినా కలిసి ఉండండి’ అని స్వయంగా ప్రధాని మోదీ మందలించి ఏడాదైందేమో! ఇప్పటికీ ఆ ‘ఐక్యత’ రాలేదు. 

ఆ దిశలో ఇప్పుడిప్పుడే కొన్ని ప్రయత్నాలు సాగుతున్నా, అవి కేంద్ర నాయకత్వానికి విశ్వాసం కలిగించే స్థాయిలో లేవు.  పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తెద్దామనే దృఢమైన కాంక్ష, పట్టుదల వీరిలో లేవు’ అని పార్టీ అధిష్టానం భావిస్తోంది. 10 (8+2) మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలున్నా వారంతా కలిసి కూర్చొని తీసుకున్న ఉమ్మడి నిర్ణయం ఉండదు, నిర్వహించే కార్యాచరణ ఉండదన్నది అధిష్టానం కోపం. 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత, కొంత ఆలస్యంగా జరిగిన సమావేశంలో కూడా ప్రధాని మోదీ రాష్ట్ర నాయకుల పనితీరుపై అసంతృప్తినే వ్యక్తం చేశారు. అయినా ఎవరి దారి వాళ్లదన్నట్టే ఉంటోంది నడక.

ఇంకో ప్రయత్నం చేస్తారా?

పార్టీ జాతీయ కార్యవర్గంలో  అంతకుముందు  తెలంగాణ నుంచి సీనియర్  మహిళా నాయకురాలు  డీ.కే. అరుణ ఉపాధ్యక్షురాలిగా, పొంగులేటి సుధాకర్ రెడ్డి కార్యదర్శిగా ఉన్నారు.  కేంద్ర మంత్రి వర్గంలో చోటు లభించేవరకు బండి సంజయ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.  ప్రస్తుతం పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యునిగా ఉన్న డా.లక్ష్మణ్ ఓబీసీ మోర్చా జాతీయ అధినేతగానూ ఉండేవారు. ఆయనే ఇటీవల మాట్లాడుతూ.. ‘జాతీయ కార్యవర్గంలో తెలంగాణను  నిర్లక్ష్యం  చేశారనడం సరికాదు,  కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు మరింత ప్రాతినిధ్యం లభిస్తుంది’ అనేవిధంగా మాట్లాడారు. 

ఇప్పటికే  తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి,  బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు.  అదనంగా డీ.కే. అరుణకుగాని,  డా. లక్ష్మణ్‌‌‌‌కిగాని అవకాశం కల్పిస్తారా?.  వేచి చూడాలి.  ఈట‌‌‌‌ల రాజేందర్​ని ఎన్నికల సంవత్సరంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేయవచ్చన్న ఊహాగానాలు  కూడా పార్టీ వర్గాల్లో ఉన్నాయి.  లేదంటే ఆయనకు జాతీయ స్థాయిలో ఏదైనా హోదా కల్పించి ఎన్నికలకు ముందర బండి సంజయ్‌‌‌‌నే  మళ్లీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తీసుకువచ్చే ఆస్కారం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు  రామచంద్ర రావుకు ఢిల్లీ స్థాయిలో ఏదైనా హోదా కల్పిస్తారన్నది వారి ఊహ.

బండి నడవాలంటే ‘బండి’ రావాలా?

జాతీయ కొత్త కార్యవర్గంలో రాష్ట్ర నాయకులకు చోటు దక్కలేదని కొందరు వాపోతున్నా... ఇచ్చినప్పుడు ఏమి సాధించారనే భావన ఢిల్లీ వర్గాల నుంచి వ్యక్తమౌతోంది. రాష్ట్ర పార్టీలో పలువురు నాయకులకు బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి అయిపోవాలని ఉన్నా,  పార్టీని అధికారంలోకి తేవాలన్న తపన, కృషి వారిలో లోపిస్తోందన్నది అధిష్టానం అభిప్రాయం. అందుకే, ఐక్యతతో శ్రమించి పనిచేయాలని తరచూ నొక్కి చెబుతోంది. హర్యానా, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలను చూసైనా చొరవ పెంచుకోవాలని చెబుతోంది.  ఇప్పటికీ రాష్ట్ర పార్టీలో ఆయనను వ్యతిరేకించే వారున్నా, పార్టీ సగటు కార్యకర్తలకు బండి సంజయ్ నాయకత్వంపైన గురి ఉంది. 

2023 ఎన్నికల ముందు కాంగ్రెస్‌‌‌‌లో  ‘రేవంత్ పగ్గాలు చేపడితేనే అధికారం’ అనే భావన వచ్చినట్టు,  బీజేపీలో  బండి సంజయ్‌‌‌‌పై  అటువంటి  అభిప్రాయం ఉంది.  అంతకుముందు పలువురు రాష్ట్ర అధ్యక్షులు తమ నియోజకవర్గాలకో, జిల్లాకో  పరిమితమయ్యారనే సొంతింటి విమర్శ ఉన్నా ‘బండి’ విషయంలో అది రాలేదు.  మూడుమార్లు పాదయాత్ర చేసి, పార్టీని క్రియాశీలం చేశారన్న పేరు వచ్చింది.  అసెంబ్లీ ఉప ఎన్నికలల్లో గెలుపు, హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ ఎన్నికల్లో పార్టీ ప్రగతి ఆయన  హయాంలోనే జరిగాయి. 

పార్టీ గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి అని ఒకవైపు పార్టీ విధానం ప్రకటించి, మరోవైపు నిష్కారణంగా ఎన్నికల ముందు బీసీ అధ్యక్షుడిని  పదవి నుంచి తప్పించారనే విమర్శ కూడా వచ్చింది.  అసెంబ్లీలో ఓడినా ఎంపీగా గెలిచారు.  కరీంనగర్ కార్పొరేషన్ గెలిపించుకున్నారు.  తన పరిధిలోకి వచ్చే పట్టభద్రుల, టీచర్ల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలనూ పార్టీ  కైవసం చేసుకుంది. 

పొత్తుల వైపు కేంద్ర నాయకత్వం మొగ్గు?

బీజేపీ అధిష్టానానికి ‘బండి’పైన సదభిప్రాయమే ఉంది.  తెలంగాణ బీజేపీలో ‘ఐక్యత’ సాధించి,  సొంతంగా ఎన్నికలు నెగ్గేందుకు అధినాయకత్వం ప్రాధాన్యత  ఇస్తుంది.  రాష్ట్ర నాయకత్వం ఆ నమ్మకం కలిగించకపోతే 2028లో పొత్తులకు  కేంద్ర నాయకత్వం ఆలోచన  చేయవచ్చు.  అప్పుడు  రెండు సినారియోలకు ఆస్కారముంది.  ఏపీలో లాగానే  బీజేపీ,  టీడీపీ, జనసేనలు  తెలంగాణలోనూ కూటమి కట్టవచ్చు.  లేదనుకుంటే, కాంగ్రెస్‌‌‌‌ను కట్టడి చేయడానికి మిగతా  దక్షిణాది రాష్ట్రాల్లోలాగానే  బలమైన  కాంగ్రేసేతర పక్షంగా  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌తో  బీజేపీ జట్టు కట్టవచ్చు.  

ఏదైనా జరగొచ్చు.  ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీ రాష్ట్ర  బీజేపీ  నాయకులకు సమయం ఇవ్వకపోయినా గంట చొప్పున సమయం వెచ్చించి ఏపీ సీఎం చంద్రబాబును, జనసేనాని పవన్ కల్యాణ్‌‌‌‌ను కలవడాన్ని బట్టి  బీజేపీకి  తెలంగాణలో  ‘లోతైన వ్యూహాలు’ ఏమైనా ఉన్నాయా? అనే సందేహం కలుగుతోంది.  జాతీయ కార్యవర్గంలో రాష్ట్ర నేతలకు చోటు దక్కక పోవడం, బీఆర్‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్‌‌‌‌‌‌‌‌ తరచూ ఢిల్లీ పర్యటనలు రాజకీయవర్గాల్లో ఊహాగానాలకు తావిస్తున్నాయి. కావాలనే బీజేపీ నాయకత్వం భవిష్యత్ పొత్తులకు ఓ దారి అట్టేపెట్టుకుంటోందా?

కేంద్ర నాయకత్వ నిర్వాకమూ ఉంది

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేంతగా ఎదగకపోవడానికి రాష్ట్ర నాయకత్వ వైఫల్యాలకు తోడు  కేంద్ర నాయకత్వ నిర్వాకాలూ ఉన్నాయి.  రాష్ట్ర నాయకత్వం ఇతరులతో  పొత్తులు వద్దన్నా ఏకపక్షంగా కేంద్ర నాయకత్వం పొత్తుల ఎత్తులు వేసిన  సందర్భాలు (2014తో సహా) కోకొల్లలు. రాష్ట్రంలో కొందరు నాయకులు తమ పదవుల కోసం పొత్తులకైనా రాజీపడతారు తప్ప పార్టీ అధికారంలోకి వచ్చేలా ఐక్యత,  నిబద్ధత చూపరని అదిష్టానం భావన.  

ఎన్నికల్ని తెలంగాణలో పూర్తిగా డబ్బు మయం చేశారని సునీల్ బన్సల్ ఇదివరకే వ్యాఖ్యానించారు.  డబ్బు దుర్వినియోగమైందని ఒక కమిటీ వేసి మరీ దర్యాప్తు చేస్తున్నారు.  పార్టీ ఎదుగుదల అవకాశాలను దారుణంగా దెబ్బకొట్టిన ‘మునుగోడు’ ఉప ఎన్నిక ఓటమి కేంద్ర నాయకత్వం తొందరపాటు నిర్ణయ ఫలితమని రాష్ట్ర వర్గాలు భావిస్తున్నాయి. ‘బీసీ’ ముఖ్యమంత్రి ప్రకటన చేసీ ‘బీసీ అధ్యక్షుడ్ని తప్పించడం, అగ్రవర్ణ అధ్యక్షులను (తాత్కాలిక, పూర్తికాలం) తీసుకురావడం, శాసనసభాపక్ష పదవైనా బీసీకి ఇవ్వకపోవడం వంటి నిర్ణయాలను ఎత్తి చూపుతున్నారు.

 కాళేశ్వరాన్ని ఏటీఎమ్ లా వాడుకున్నారని విమర్శించి, సీబీఐ ద్వారా పోటీ ప్రతిపక్షమైన బీఆర్‌‌‌‌ఎస్ నాయకులపై గట్టి చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపడుతున్నారు. పార్టీలో ఇంటాబయట నాయకుల మధ్య సయోధ్య కుదిర్చి, కలిసి పనిచేసేలా ఫలితం సాధించడంలో ఇరువురి వైఫల్యమూ ఉంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా బలోపేతం చేయడంలో అధినాయకత్వానికి లోతైన మార్మిక వ్యూహమేమైనా ఉందా?  కోటి రూకల ప్రశ్న!

- దిలీప్ రెడ్డి, 
పొలిటికల్ ఎనలిస్ట్,  పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.