పండుగ సీజన్ వచ్చిందంటే చాలు.. కొత్త కారు కొనుగోలు చేయాలని చాలామంది ఉత్సాహం చూపుతుంటారు. అయితే డ్రీమ్ కార్ ఇంటికి తెచ్చే ముందు కార్ లోన్‌తో పాటు ఇన్సూరెన్స్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా డీజిల్ ఎస్‌యూవీ వేరియంట్ల విషయానికి వస్తే.. పర్సనల్ కవర్, థర్డ్-పార్టీ కవరేజ్‌తో కలిపి ఇన్సూరెన్స్ ఖర్చు రూ.40వేలు దాటే అవకాశం ఉంది.
కొత్త కారు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఓన్-డామేజ్, థర్డ్-పార్టీ, యాడ్-ఆన్ కవర్ల వివరాలను విడివిడిగా తనిఖీ చేయాలి. డీలర్ ఇచ్చే స్టాండర్డ్ బండిల్‌ను గుడ్డిగా నమ్మకుండా.. పాలసీ డాక్యుమెంట్‌ను పూర్తిగా చదవడం బెస్ట్. జీఎస్‌టీతో కలిపి సుమారు రూ. 44వేల 261 వరకు ప్రీమియం పడే అవకాశం ఉందనే విషయాన్ని కొనుగోలుదారులు గుర్తుంచుకోవాలి.
జీరో డిప్రిసియేషన్, రిటర్న్ టు ఇన్‌వాయిస్, ఇంజిన్ ప్రొటెక్షన్ వంటి యాడ్-ఆన్‌లు ఎంతవరకు అవసరమో అంచనా వేయాలి. ఇవి దొంగతనం, ప్రమాదాల సమయంలో అదనపు ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయి. అయితే టైర్ ప్రొటెక్షన్, కీ రీప్లేస్‌మెంట్ వంటి ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ అంతగా అవసరం లేకపోవచ్చు కాబట్టి మీ అవసరాలకు తగినట్లుగా మాత్రమే ఆప్షన్స్ పరిశీలించి ఎంచుకోవాలి.
ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ, డిడక్టిబుల్స్‌ను సరిపోల్చడం చాలా ముఖ్యం. తక్కువ ప్రీమియం కోసం తక్కువ ఐడీవీని ఎంచుకుంటే.. క్లెయిమ్ సమయంలో మీ జేబు నుంచి ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి క్యాష్ లెస్ గ్యారేజ్ నెట్‌వర్క్, క్లెయిమ్ ప్రాసెస్ వంటి అంశాలను ముందుగానే చెక్ చేసుకోవాలి.
ఒకవేళ రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే, ఎలాంటి వాదనలకు దిగకుండా ప్రశాంతంగా వ్యవహరించాలి. అవతలి వ్యక్తి లైసెన్స్, ఫోన్ నంబర్, వెహికల్ రిజిస్ట్రేషన్ వివరాలు తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ కాపీలు, ఎఫ్ఐఆర్ రిపోర్ట్ వంటి పత్రాలను భద్రపరుచుకుంటే త్వరగా క్లెయిమ్ పొందవచ్చు.
