న్యూఢిల్లీ: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, భారీ కన్‌స్ట్రక్షన్ సెక్టార్‌లో ఉపయోగించే అత్యాధునిక యంత్రాల తయారీని దేశీయంగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 11,500 కోట్ల (1.2 బిలియన్ డాలర్ల) తో ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించనుంది. దీని ద్వారా ఏడేళ్ల వ్యవధిలో 1.8 బిలియన్ డాలర్ల (రూ.17,280 కోట్ల) విలువైన పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మెట్రో రైళ్లు, హైవే ప్రాజెక్టుల్లో ఉపయోగించే టన్నెల్ బోరింగ్ మెషీన్లు (టీబీఎంలు), అగ్నిమాపక పరికరాలు, ఎత్తైన బిల్డింగ్‌లలో ఉపయోగించే అధునాతన ఎలివేటర్లను లోకల్‌గా తయారు చేయడాన్ని ప్రొత్సహించనున్నారు. ప్రభుత్వరంగ బీఈఎంఎల్‌తో పాటు లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ), జాన్సన్ లిఫ్ట్స్ వంటి సంస్థలు ఈ పథకంతో లాభపడనున్నాయి.
భారత ఇన్‌ఫ్రా ఎక్విప్‌మెంట్ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. లక్ష కోట్ల (10.5 బిలియన్ డాలర్ల) పైనే ఉంది. కీలకమైన టన్నెల్ బోరింగ్ యంత్రాల కోసం ప్రస్తుతం చైనాపైనే కంపెనీలు ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ స్కీమ్‌ను ప్రకటించింది.
