- చైనీస్ కంపెనీల వాటా 10 % లోపున్న విదేశీ కంపెనీలకు మే నెలలో ఊరట
న్యూఢిల్లీ: ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ (ఎఫ్‌డీఐ) రూల్స్ సవరించడంతో పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. ఈ ఏడాది మే నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.4,895.65 కోట్ల విలువైన 29 ఎఫ్‌డీఐ ప్రపోజల్స్ వచ్చాయని కేంద్రం ప్రకటించింది. విదేశీ కంపెనీల్లో చైనా లేదా హాంకాంగ్‌కు చెందిన పెట్టుబడిదారుల వాటా 10 శాతం లోపు ఉండి, వారికి మేనేజ్‌మెంట్ నియంత్రణ లేకపోతే ... ముందస్తు అనుమతి లేకుండా ఆటోమేటిక్ రూట్ ద్వారా పెట్టుబడులు పెట్టొచ్చు.
గతంలో భారత్‌తో భూ సరిహద్దు పంచుకునే దేశాల వ్యక్తులు లేదా సంస్థలకు ఎంత వాటా ఉన్నా, ఆ విదేశీ కంపెనీలు ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలన్నా ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చేది. తాజా సవరణల తర్వాత కూడా చైనా, హాంకాంగ్ లేదా భారత్‌తో సరిహద్దు పంచుకునే దేశాలలో నేరుగా రిజిస్టర్ అయి ఉన్న కంపెనీలకు ఈ సడలింపు వర్తించదు.
ఇతర దేశాల్లోని చైనీస్ కంపెనీల వాటాలున్న సంస్థలకే సడలింపు ఉంది. చైనా వాటా 10 శాతం కంటే ఎక్కువగా ఉన్న విదేశీ కంపెనీలకు కూడా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.
ఈ సెక్టార్లలోకి పెట్టుబడులు
ఎఫ్డీఐ రూల్స్ మార్చిన తర్వాత ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), తయారీ రంగం, ఫార్మాస్యూటికల్స్, డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ వంటి సెక్టార్లలోకి పెట్టుబడులు భారీగా వచ్చాయి. ముఖ్యంగా మారిషస్, అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్, లగ్జెంబర్గ్, కేమన్ ఐలాండ్స్ దేశాల నుంచి ఈ 29 పెట్టుబడి ప్రపోజల్స్ అందాయి.
