బెయిలబుల్ కేసు కావడంతోనే ఎంపీ కొడుకును అరెస్ట్ చేయలేదు: డీసీపీ రితిరాజ్

బెయిలబుల్ కేసు కావడంతోనే ఎంపీ కొడుకును అరెస్ట్ చేయలేదు: డీసీపీ రితిరాజ్
  • మాపై ఎంపీ లింగమనేని రమేశ్​ నుంచి ఒత్తిడి లేదు: డీసీపీ రితిరాజ్
  • రోడ్డు ప్రమాదంలో యువతి మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతున్నదని వెల్లడి

మాదాపూర్, వెలుగు: నిర్లక్ష్యంగా కారు నడుపుతూ యువతి మృతికి కారణమైన కేసులో జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజూష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దర్యాప్తు కొనసాగుతున్నట్లు కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి డీసీపీ రితిరాజ్ వెల్లడించారు. ఎంపీ కొడుకు కావడంతోనే నిందితుడిని అరెస్ట్ చేయడం లేదంటూ వస్తున్న విమర్శలపై ఆమె శుక్రవారం ఓ ప్రకటనలో క్లారిటీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన రోజే నిందితుడు సంజూష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అదుపులోకి తీసుకున్నామని, కారును స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు.

నిందితుడికి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్స్ పరీక్షల్లో నెగటివ్ వచ్చిందన్నారు. అయినప్పటికీ బ్లడ్ శాంపిల్స్ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపామని చెప్పారు. ఎంపీ తమపై ఎలాంటి ఒత్తిడి తెలేదని స్పష్టం చేశారు. నిందితుడిపై బీఎన్ఎస్​106(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశామని.. ఇది బెయిలబుల్ సెక్షన్ కావడంతో అతనికి నోటీసులిచ్చి విచారణకు రావాలని ఆదేశించామని వివరించారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్​కోణంలో దర్యాప్తు సాగుతున్నదని.. ఫోరెన్సిక్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మద్యం సేవించినట్లు తేలితే సెక్షన్లు మారుస్తామని తెలిపారు. ఎంపీ కుమారుడనే కారణంతో  నిందితుడిని అరెస్ట్​ చేయడం లేదనే ఆరోపణల్లో నిజం లేదని డీసీపీ పేర్కొన్నారు.  

అసలేం జరిగిందంటే..

ఈ నెల 16న మధ్యాహ్నం ఐటీసీ కోహినూర్ నుంచి ఇనార్బిట్ మాల్ వైపు రోడ్డు దాటుతున్న భారతి ముఖి (26) అనే యువతిని మాదాపూర్ వైపు నుంచి వచ్చిన కారు వేగంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన భారతిను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు కారణమైన లింగమనేని సంజూష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పోలీసులు బీఎన్ఎస్ 106(1) సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, యువతి మృతికి కారణమైన సంజూష్​ను పోలీసులు అరెస్ట్​చేయకుండా కేవలం నోటీసులిచ్చి పంపించడంపై విమర్శలు వస్తున్నాయి. ఎంపీ కొడుకు కాబట్టే నిందితుడిని కాపాడుతున్నారని పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే  కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్ ప్రకటన విడుదల చేశారు.