దానం అనర్హత పిటిషన్లపై ముగిసిన వాదనలు..సెప్టెంబర్ 16కు తీర్పు వాయిదా 

దానం అనర్హత పిటిషన్లపై ముగిసిన వాదనలు..సెప్టెంబర్ 16కు తీర్పు వాయిదా 

హైదరాబాద్, వెలుగు: ఖైరతాబాద్‌‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌ పార్టీ ఫిరాయింపు ఆరోపణల నేపథ్యంలో అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పును సెప్టెంబర్ 16కు వాయిదా వేసింది. బీఆర్‌‌ఎస్‌‌ తరఫున ఎన్నికై కాంగ్రెస్‌‌లోకి చేరారంటూ దానం నాగేందర్‌‌పై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేయడాన్ని సవాల్‌‌ చేస్తూ.. బీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్‌‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్‌‌ కుమార్‌‌ సింగ్, జస్టిస్‌‌ జీఎం మొహియుద్దీన్‌‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. బీఆర్‌‌ఎస్‌‌ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌‌లో చేరారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు.

బహిరంగ వేదికపై సీఎం సమక్షంలో కాంగ్రెస్‌‌ కండువా కప్పుకున్నారని, కాంగ్రెస్‌‌ తరఫున లోక్‌‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేశారని గుర్తుచేశారు. మరో పార్టీ తరఫున పోటీ చేయడమంటే పాత పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లేనని స్పష్టం చేశారు. దానం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. దానం తన సభ్యత్వాన్ని అధికారికంగా వదులుకోలేదని, బీఆర్‌‌ఎస్‌‌ పార్టీ కూడా ఆయనును బహిష్కరించలేదని తెలిపారు. లోక్‌‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి రాజ్యాంగంలో నిషేధం లేదన్నారు.