- ప్రారంభమైన అడ్మిషన్లు.. వచ్చే నెల 5 వరకు స్వీకరణ
- జవహర్ నగర్ మోడల్ స్కూల్ లో నిర్వహణ
- డేస్కాలర్ లో దూరం పెరుగుతుందని అభ్యర్థుల తల్లిదండ్రుల విన్నపం
- జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
ములుగు, వెలుగు : ములుగు జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలన్న స్థానికుల ఏడేళ్ల నిరీక్షణకు తెరపడింది. మాజీ ఎంపీ ఆధ్వర్యంలో పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి వినతులు సమర్పించినప్పటికీ ఇన్నాళ్లూ ఆమోదం లభించలేదు. అయితే స్థానిక మంత్రి సీతక్క చొరవతో ఈ నెల 6న ములుగులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. దీంతో అడ్మిషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు వెంకటాపూర్ మండలం జవహర్‌నగర్‌లోని మోడల్ స్కూల్‌లో తాత్కాలికంగా తరగతులు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సుమారు 15 మంది బోధనా సిబ్బంది, మరో 10 మంది నాన్ టీచింగ్ సిబ్బందిని, ఐదు తరగతి గదులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సమాచారం.
సెప్టెంబర్ 5 వరకు దరఖాస్తులు..
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఆధ్వర్యంలో ములుగు కేవీఎస్‌లో 2026-–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ప్రిన్సిపల్ సీతారాం వివరాలు వెల్లడిస్తూ ఈ నెల 21 నుంచి సెప్టెంబర్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. బాలవాటిక-1 (నర్సరీ), బాలవాటిక-2 (ఎల్‌కేజీ), బాలవాటిక-3 (యూకేజీ)తో పాటు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు నూతన ప్రవేశాలు కల్పించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం సెప్టెంబర్ 10న లాటరీ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 12న జాబితాను ప్రకటించి, 15 నుంచి 21 వరకు ప్రవేశాలు, ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టనున్నారు. సెప్టెంబర్ 23 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ప్రవేశ మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారమే అడ్మిషన్లు నిర్వహిస్తామని, విద్యార్థుల వయస్సు, రిజర్వేషన్ తదితర నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న తల్లిదండ్రులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తాత్కాలిక పాఠశాలపై తల్లిదండ్రుల ఆందోళన..
కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుపై హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ తాత్కాలిక తరగతుల నిర్వహణపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వెంకటాపూర్ మండలం జవహర్‌నగర్‌లోని మోడల్ స్కూల్ ములుగు జిల్లా కేంద్రానికి దూరంగా ఉండటంతో చిన్నారులకు రాకపోకల ఇబ్బందులు ఎదురవుతాయని వారు చెబుతున్నారు. ముఖ్యంగా నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ స్థాయి నుంచే తరగతులు ప్రారంభం కానుండటంతో సుదూర ప్రాంతాల నుంచి చిన్నారులు పాఠశాలకు ఎలా చేరుకుంటారని ప్రశ్నిస్తున్నారు. జాతీయ రహదారి నుంచి పాఠశాల సుమారు కిలోమీటరు దూరంలో ఉండటంతో డేస్కాలర్స్ సమయానికి చేరుకోవడం కూడా ఇబ్బందికరమేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా కేంద్రంలో రవాణా సౌకర్యం అందుబాటులో ఉన్న ప్రాంతంలో కేవీఎస్ తాత్కాలిక తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు. అవసరమైతే విద్యార్థులకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసే అవకాశం ఉందని
సమాచారం.
