UPI ఛార్జీల ఎఫెక్ట్: గ్రామాల్లోకి దొంగ నోట్లు మార్చే గ్యాంగ్స్.. చిరు వ్యాపారులకు అలర్ట్

UPI ఛార్జీల ఎఫెక్ట్: గ్రామాల్లోకి దొంగ నోట్లు మార్చే గ్యాంగ్స్.. చిరు వ్యాపారులకు అలర్ట్

మరో 10 రోజుల్లో దేశవ్యాప్తంగా మోడీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త యూపీఐ ఛార్జీలు వ్యాపారులపై పడనున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది ముందుగానే డిజిటల్ చెల్లింపుల స్వీకరణను తగ్గించి.. ప్రజలను క్యాష్ తెచ్చుకోవాలని కోరుతున్నారు. చిన్న చెల్లింపులపై ఎలాంటి ఛార్జీ లేనప్పటికీ హోల్ సేల్ షాపుల్లో తాము సరుకు కొనటానికి వెళ్లినప్పుడు వ్యాపారులు క్యాష్ కావాలి, యూపీఐ పేమెంట్స్ తీసుకోం అంటూ చెప్పటంతో చిరువ్యాపారులు, గ్రామాల్లోని కిరాణా వ్యాపారులు కూడా క్యాష్ పేమెంట్స్ కోసం కస్టమర్లను డిమాండ్ చేస్తున్నారు. 

అయితే అసలు సమస్య ఇక్కడే వచ్చింది. దేశవ్యాప్తంగా యూపీఐ ఛార్జీల భారంతో పెద్ద వ్యాపారుల నుంచి గ్రామాల్లోని చిన్న వ్యాపారుల వరకూ డబ్బు చెల్లింపులకు మారటాన్ని కేటుగాళ్లు ఆసరాగా వాడుకుంటున్నారు. సిటీల్లో దొంగ నోట్లు మార్చటం కుదరదు కాబట్టి.. ఇప్పుడు చాలా చోట్ల గ్రామాల్లో క్యాష్ పేమెంట్స్ స్వీకరించటంతో కొత్తకొత్త గ్రామాలకు వెళ్లి తమ వద్ద ఉండే దొంగ నోట్లను మార్చే పనిలో ఉన్నారు కొందరు ముఠాలు. 

ఇప్పటికే ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఈ గ్యాంగ్స్ చేసిన మోసాలకు వ్యాపారులు షాక్ అవుతున్నారు. చాలా కాలం తర్వాత మళ్లీ క్యాష్ వాడకం పెరగటంతో ప్రజల్లో కొంత అవగాహన లేమిని ఆసరాగా మార్చుకుని సండదిలో సడేమియా అంటూ దొంగనోట్ల దందా జోరుగా సాగిస్తున్నారు. కూల్ డ్రింగ్ షాపులు, కూరగాయల వ్యాపారులు, కిరాణా దుకాణదారులు లాంటి రద్దీ ప్రాంతాల్లో ఉండే హడావిడిని వాడుకుంటూ సైలెంట్ గా నకిలీ రూ.500 నోట్లను మార్చేస్తున్నారు. సో మారుతున్న వ్యాపార అవసరాలను దృష్టిలో పెట్టుకుని క్యాష్ పేమెంట్స్ స్వీకరించాలనుకుంటున్న చిన్న వ్యాపారులు అసలు నోట్లపై అవగాహన పెంచుకుని నకిలీ నోట్ల ముఠాల నుంచి జాగ్రత్తగా మెలగటం చాలా కీలకం. క్యాష్ తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని నోట్లను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.