కేసముద్రంలో మంటల్లో తగలబడిన India1 ఏటీఎం.. ఏం మిగల్లే..!

కేసముద్రంలో మంటల్లో తగలబడిన India1 ఏటీఎం.. ఏం మిగల్లే..!

కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో ఏటీఎంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చింది.

ఏటీఏం పక్కన ఉన్న ఇంట్లో నుంచి జనం భయంతో పరుగులు తీశారు. ఏటీఏంలో సామాగ్రి పూర్తిగా ఖాళీపోయింది. తెల్లవారుజామున కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఏ అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న వేళ జరిగి ఉంటే మంటలు చుట్టుపక్కల ఇళ్లకు కూడా వ్యాపించేవి.

మంచిర్యాల జిల్లాలో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. మంచిర్యాల పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని డయాలసిస్ రూమ్ ఏసీ పేలింది. మంటలు, పొగ పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఇద్దరు పేషెంట్లు డయాలసిస్ రూంలో ఆ సమయంలో ఉన్నారు. అప్రమత్తమైన సిబ్బంది ఇద్దరినీ కాపాడారు. 

డయాలసిస్ మెషీన్లు మంటల్లో కాలిపోయి ధ్వంసం కావడంతో పది లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.