ఒకపక్క యుద్ధాలతో పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరోపక్క సూపర్ ఎల్ నినో కలిసి ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు తమ వడ్డీ రేట్లను పెంచాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈ ఏడాది చివరి నాటికి భారత్ కూడా ఇదే దారిలో పయనించనుందని నిపుణుల అంచనా. అయితే వడ్డీ రేటు 25 పాయింట్ల నుంచి 50 పాయింట్ల వరకూ పెంచుతారనేది ఒక అంచనా. ఈ వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియ ఎఫెక్ట్ మరో రెండేళ్ల పాటు కొనసాగుతుందని వారు చెబుతున్నారు. అంటే 2028 చివరి వరకూ పరిస్థితులు దారణంగా మారనున్నాయన్నమాట. అంటే ఇప్పటికే కారులోన్, హోమ్ లోన్ వంటివి తీసుకుని చెల్లింపులు చేస్తున్నవారికి ఈ రానున్న రెండేళ్లు మరింత ఆర్థిక భారం తప్పదు.
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువగా ఉన్నందున సెంట్రల్ బ్యాంక్ తన పాలసీ సమీక్షలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఈ చిన్న పెరుగుదల సాధారణంగానే కనిపిస్తున్నప్పటికీ.. దీర్ఘకాలంలో హోమ్ లోన్, కారు లోన్ తీసుకున్న వారిపై ఇది చాలా పెద్ద ఆర్థిక ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా రెపో రేటుకు లింక్డ్ లోన్లకు ఈ మార్పు నేరుగా వర్తిస్తుంది.
రూ. 50 లక్షల లోన్ పై ప్రభావం లెక్కలు ఇవిగో:
ఒక వ్యక్తి 25 సంవత్సరాల కాలానికి 7.5% వడ్డీ రేటుతో రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారని భావిస్తే వారిపై పెరగనున్న వడ్డీ రేట్ల ఎఫెక్ట్ ఎలా ఎంత వరకూ ఉంటుందనేది లెక్కల్లో తెలుసుకుందాం రండి. ఒకవేళ వడ్డీ రేట్లను రిజర్వు బ్యాంక్ 25 బేసిస్ పాయింట్లు పెంచితే పరిస్థితి ఏంటనేది చూద్దాం..
* వడ్డీ రేట్లు పెరగక మునుపు ప్రస్తుత నెలవారీ EMI: సుమారు రూ.36వేల 950 ఉంటుంది.
* వడ్డీ రేటు పెంపు: ఒకవేళ రిజర్వు బ్యాంక్ వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్లు పెరిగితే... కట్టాల్సిన గడువు మారకుండా ఉండాలంటే మీ ఈఎంఐ సుమారు రూ.817 పెరుగుతుంది.
* కొత్త ఈఎంఐ: దీనితో నెలవారీ చెల్లింపు సుమారు రూ.37వేల 767కు చేరుకుంటుంది.
* వార్షిక వడ్డీ భారం: అంటే ఏడాదికి అదనంగా దాదాపు రూ.9వేల 800 అదనపు వడ్డీ రూపంలో చెల్లించాల్సి వస్తుంది.
* మొత్తం 25 ఏళ్ల కాలానికి వడ్డీ భారం: ఈ మొత్తం 25 ఏళ్ల కాలపరిమితిపై చూస్తే.. కేవలం ఆ 25 bps పెంపు వల్ల చెల్లించాల్సిన అదనపు వడ్డీ భారం సుమారు రూ.2లక్షల 45వేలుగా మారుతుంది.
1. ఈఎంఐ పెరుగుతుందా? కాలపరిమితి మారుతుందా?
రేట్లు పెరిగిన వెంటనే కొన్ని లెండర్ సంస్థలు ఈఎంఐని పెంచితే.. మరికొన్ని సంస్థలు లోన్ కాలపరిమితిని పొడిగిస్తాయి. మరికొన్నిసార్లు ఈ రెండింటి కలయికను అమలు చేస్తాయి. మీ బ్యాంకు పెరిగిన వడ్డీ రేట్లను ఎలా అడ్జెస్ట్ చేస్తుందో ముందుగా తెలుసుకోవడం ముఖ్యం.
2. భారాన్ని తగ్గించుకోవడానికి మార్గాలు:
* స్వచ్ఛందంగా ఈఎంఐ పెంచడం: రేట్లు పెరిగినప్పుడు రుణ కాలపరిమితి పెరగకుండా.. మీరే స్వచ్ఛందంగా ఈఎంఐ మొత్తాన్ని పెంచడం ద్వారా లాంగ్ టర్మ్ లో వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు.
* ముందస్తు పేమెంట్స్: వార్షిక బోనస్‌లు, ఇతర అదనపు ఆదాయం వచ్చినప్పుడు కొంత మెుత్తాన్ని లోన్ ముందస్తు చెల్లింపులు చేయడం ద్వారా అసలు మొత్తాన్ని తగ్గించుకోవచ్చు. దీనివల్ల మిగిలిన కాలంలో పడే వడ్డీ భారం తగ్గుతుంది.
చిన్నగా కనిపించే 25 బేసిస్ పాయింట్ల పెంపు రూపాయి పరంగా చాలా పెద్ద మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ముందుగానే అప్రమత్తమై తగిన ఆర్థిక ప్రణాళికను అనుసరించడం ఉత్తమం. ఇందుకోసం మీ ఆర్థిక సలహాదారులు, ఛార్టెడ్ అకౌంటెంట్లను సంప్రదించి అవసరమైన సూచనలు తీసుకోవటం బెటర్.
