రాయదుర్గం పాన్ మక్తా భూముల వేలం పిటిషన్ కొట్టివేత..జోక్యానికి నిరాకరించిన సుప్రీంకోర్టు 

రాయదుర్గం పాన్ మక్తా భూముల వేలం పిటిషన్ కొట్టివేత..జోక్యానికి నిరాకరించిన సుప్రీంకోర్టు 

న్యూఢిల్లీ: హైదరాబాద్‌‌లోని రాయదుర్గంలో విలువైన పాన్ మక్తా భూముల వేలం ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ వేలం ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. పాన్ మక్తా భూముల వేలం ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ పిటిషనర్ జువ్వాడి ప్రణయ్ సింహారావు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది.

గతంలో కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని, అప్పుడు రక్షించమని కోరిన భూములనే ఇప్పుడు వేలం వేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ వాదనలను రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది తీవ్రంగా ఖండించారు. పిటిషనర్ కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని, ఆ భూములకు ప్రస్తుతం వేలం వేస్తున్న భూములకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఈ వ్యవహారంలో కలుగజేసుకునేందుకు నిరాకరిస్తూ పిటిషన్‌‌ను కొట్టివేసింది.