పాపం ఈ 16 ఏళ్లబ్బాయి.. తిండి తినడం.. నీళ్లు తాగడం.. అన్నీ చెరువులోనే..!

పాపం ఈ 16 ఏళ్లబ్బాయి.. తిండి తినడం.. నీళ్లు తాగడం.. అన్నీ చెరువులోనే..!

ముర్షిదాబాద్: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడు ఎక్కువ సమయం చెరువులోనే గడుపుతున్నాడు. నీళ్ల నుంచి బయటికొస్తే చర్మం భరించలేనంతగా మంట పుడుతుండటంతో చెరువులోనే ఉంటున్నాడు. గత ఐదేళ్లుగా తిండీతిప్పలు అన్నీ చెరువులోనే. ఈ పిల్లాడి పేరు ఇక్బాల్ షేక్. అతనికి వచ్చిన అరుదైన చర్మ వ్యాధి పేరు ఎరిథ్రోమెలాల్జియా అని వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ చర్మ వ్యాధి నుంచి అతనికి విముక్తి కలిగించడానికి పిల్లాడి కుటుంబం తిరగని ఆసుపత్రి లేదు. కలవని డాక్టర్ లేరు. ఏ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం దొరకలేదు.

ఎరిథ్రోమెలాల్జియా అనేది ఒక అరుదైన చర్మ వ్యాధి. ఈ వ్యాధి బారిన పడితే ఒళ్లంతా విపరీతమైన మంటతో కూడిన నొప్పి, చర్మం ఎర్రబడటం, చర్మం అసాధారణంగా వేడెక్కడం వంటి లక్షణాలు ఉంటాయి. కాళ్లూచేతులను ఈ వ్యాధి ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. అందుకే ఈ వ్యాధి బారిన కొంతమందికి చల్లదనం ఉపశమనాన్ని ఇస్తుంది. అందుకే.. ఇక్బాల్ ఎక్కువ సమయం చెరువులోనే గడుపుతున్నాడు. పాపం చెరువులోనే తింటున్నాడు. చెరువులోనే ఉంటున్నాడు.

►ALSO READ | కొండపై నుంచి దూకేసిన కొడుకు.. కాపాడే క్రమంలో తండ్రి కూడా.. భర్త, కొడుకుకు కళ్ల ముందే ఇలా జరగడంతో..

ఎరిథ్రోమెలాల్జియా అనేది నరాలు, చిన్న రక్తనాళాలకు సంబంధించిన ఒక అరుదైన వ్యాధి. ఈ వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ శరీరం వేడిగా, ఎర్రగా, వాపుగా, భరించలేనంత మంటగా ఉంటుంది. ఈ నొప్పి తిమ్మిరి నుంచి తీవ్రమైన మంటకు దారితీస్తుంది. ఈ లక్షణాలు కొన్ని నిమిషాల నుంచి చాలా రోజుల వరకు కొనసాగవచ్చు. కొంతమందిలో.. నొప్పి నిరంతరం ఉండే అవకాశం కూడా ఉంది. ఈ వ్యాధి కారణంగా ప్రభావితమైన శరీరం మండుతున్నట్లుగా లేదా వేడినీటితో కాలిపోయినట్లుగా అనిపించవచ్చు. సాధారణం కంటే ఎక్కువగా చెమట పడుతుంది.

ఎరిథ్రోమెలాల్జియా ఉన్నవారు ప్రభావిత శరీరాన్ని చల్లబరచడానికి ఫ్రిడ్జ్లో ఐస్ చర్మంపై పెట్టుకుంటుంటారు. చల్లటి నీటిలో ఉంటారు. ఉపశమనం కోసం ఇక్బాల్ షేక్ కూడా చెరువులో ఉండటానికి కూడా ఇదే కారణం. ఎరిథ్రోమెలాల్జియా వంటి అరుదైన పరిస్థితికి సరైన నిర్ధారణ, ప్రణాళికతో కూడిన చికిత్స అవసరం.