దాదాపు ఏడు దశాబ్దాల పాటు దక్షిణాది ప్రేక్షకులను తన నటనతో అలరించిన అలనాటి మహానటి షావుకారు జానకి (94) ఇక సెలవు తీసుకున్నారు. అనారోగ్య సమస్యలతో చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆగస్టు 21న తుదిశ్వాస విడిచారు. దాదాపు 400 సినిమాల్లో నటించి, ఎన్నో అవార్డులు అందుకున్న ఆమెకు 2022లో పద్మశ్రీ పురస్కారం లభించింది.
అయితే.. ఒకప్పుడు వెండితెరను ఏలిన ఈ దిగ్గజ నటి సినీ ప్రయాణం మాత్రం అసలు ఊహించని పరిస్థితుల్లో మొదలైంది. చిన్నతనంలో ఆల్ ఇండియా రేడియోలో బాలల కార్యక్రమాల్లో పాల్గొన్న జానకి గొంతు, ఉచ్చారణ విని విజయా సంస్థ అధినేత బి.ఎన్.రెడ్డి ఆమెను సినిమాల్లో నటించమని అడిగారు. కానీ కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది. అప్పటికే ఆమెకు 15 ఏళ్లకే శంకరమంచి శ్రీనివాస రావుతో వివాహం జరిగింది. ఆ తర్వాత భర్తకు సరైన ఆదాయం లేక కుటుంబ పరిస్థితులు ఇబ్బందుల్లో పడటంతో.. చేతిలో చిన్నారిని పట్టుకుని సినిమా అవకాశాల కోసం ఆమె మళ్లీ చెన్నైకి వెళ్లారు.
అలా ఎన్టీఆర్ హీరోగా నటించిన 'షావుకారు'లో తొలిసారి కథానాయికగా అవకాశం దక్కింది. ఆ సినిమాకు ఆమె అందుకున్న తొలి పారితోషికం రూ.2,500. అప్పటి కష్టకాలంలో ఆ మొత్తం తనకు రెండున్నర లక్షల రూపాయలతో సమానంగా అనిపించిందని జానకి పలు ఇంటర్వ్యూల్లో గుర్తుచేసుకున్నారు. ఆ డబ్బుతో తన బిడ్డకు అవసరమైన వస్తువులు, దుస్తులు కొనుగోలు చేసినట్లు కూడా ఆమె చెప్పిన సందర్భాలున్నాయి.
►ALSO READ | షావుకారు జానకి మృతిపై ప్రముఖుల సంతాపం.. ఓ సినీ యుగం ముగిసిందంటూ భావోద్వేగ నివాళులు!
ఇక్కడే మరో అద్భుతం జరిగింది. 'షావుకారు' సినిమా విజయం తర్వాత జానకి పేరుకు ఆ సినిమా పేరు శాశ్వతంగా జతకలిసిపోయింది. అలా 'షావుకారు జానకి'గా ఆమె సినీ చరిత్రలో నిలిచిపోయారు. దాదాపు 400 చిత్రాలతో పాటు వేలాది స్టేజ్ ప్రదర్శనల్లోనూ పాల్గొన్న ఆమె.. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజాల నుంచి వృత్తిపట్ల క్రమశిక్షణ, నిబద్ధత నేర్చుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తొలి చిత్రంతోనే సక్సెస్ ను అందుకుంది.
ఇక తన చెల్లెలు, ప్రముఖ నటి కృష్ణకుమారితో పోలికలపైనా జానకి ఆసక్తికరంగా స్పందించేవారు. కృష్ణకుమారి అందంగా, పొడవుగా ఉండేదని.. తాను మాత్రం 'అందమైన బాతు పిల్ల'లా ఉండేదాన్నని సరదాగా చెప్పిన ఆమె, ఆ పోలికలు తనను ఎప్పుడూ బాధించలేదని తెలిపారు. రూ.2,500 పారితోషికంతో మొదలైన ఆ ప్రయాణం.. పద్మశ్రీ వరకు చేరింది. తెరపై పోషించిన పాత్రలతోనే కాదు.. తన జీవిత పోరాటంతోనూ షావుకారు జానకి ఒక చరిత్రగా మిగిలిపోయారు. జానకి హుందాతనం, గౌరవం, అద్భుతమైన సినీ ప్రయాణం నేటి తరాలకు ఎంతో ఆదర్శం నిలుస్తున్నారు..
