నైపిడా: మయన్మార్ మధ్య ప్రాంతంలోని సాగైంగ్ రీజియన్‌లోని బౌద్ధ మఠంపై వైమానిక దాడి జరిగింది. ఫైటర్ జైట్ కురిపించిన బాంబుల వర్షానికి 14 మంది చనిపోగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. మయన్మార్ సైన్యం ఈ దారుణానికి ఒడిగట్టింది. మయన్మార్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన మాండలేకు పశ్చిమాన దాదాపు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న మ్యాంగ్ టౌన్‌షిప్‌లోని స్వెల్ లే ఓహ్ గ్రామంలో శుక్రవారం (ఆగస్ట్ 21) ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది.
బౌద్ధుల పవిత్ర కాలమైన లెంట్ సందర్భంగా స్థానిక మఠంలో వారం రోజుల ధ్యాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో దాదాపు 100 మందికి పైగా పాల్గొన్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం మయన్మార్ సైన్యం మఠంపై వైమానిక దాడి చేసింది. కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే రెండు బాంబులు వేసింది. ఈ దాడుల్లో 14 మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. బాంబుల ధాటికి మఠం పూర్తిగా నేలమట్టం అయ్యింది. అప్పటి వరకు యోగ, ధ్యాన వేడుకలతో సందడిగా ఉన్న మఠంతో వైమానిక దాడితో శ్మశానంలా మారిపోయింది.
దాడులకు కారణమేంటంటే..?
మయన్మార్‌లో 2021 ఫిబ్రవరిలో ప్రభుత్వాన్ని కూలగొట్టి సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పటి నుంచి సైన్యం, ప్రజాస్వామ్య అనుకూల శక్తులు పోరాటంతో మయన్మార్ అట్టుడికిపోతోంది. ఈ పోరాటంలో వైమానిక దాడులు సర్వ సాధారణంగా మారాయి. పౌరులు, ప్రతిపక్ష బృందాలను లక్ష్యంగా చేసుకుని సైన్యం దారుణాలకు తెగబడుతోంది. శుక్రవారం (ఆగస్ట్ 21) సాగైంగ్ రీజియన్‌లోని బౌద్ధ మఠంపై జరిగిన దాడి కూడా సైన్యం చేసిందే. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేయడంతో మయన్మార్ సైన్యంపై పలు దేశాలు మండిపడుతున్నాయి.
►ALSO READ | అలస్కాలో ఘోర విమాన ప్రమాదం..చార్టర్ విమానం కూలి 8మంది మృతి
