- 28 మందితో పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్
- గ్రేహౌండ్స్, ఆక్టోపస్ వారికి 3 రోజుల శిక్షణ
- ఆకస్మిక తనిఖీలకు స్పెషల్ టాస్క్ ఫోర్స్
- కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కంట్రోల్లో టీమ్స్
హైదరాబాద్, వెలుగు: రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్కోసం పంపితే బయట అమ్ముకొని ఆ బకాయిలు కట్టకుండా వేధిస్తున్న మిల్లర్లపై కఠిన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో సివిల్ సప్లయ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను బలోపేతం చేస్తున్నది. ఇందులో భాగంగా రైస్‌మిల్లుల్లో తనిఖీలు, బకాయిల వసూళ్ల కోసం గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలకు చెందిన 28 మంది అత్యుత్తమ కమాండోలను సివిల్ సప్లయ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ విభాగంలోకి తీసుకున్నది. వీరితో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ టీమ్‌లను ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించనుంది.ఇప్పటికే ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు కమాండోల నైపుణ్యాన్ని జోడించడం ద్వారా బకాయి వసూళ్లను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ముఖ్యంగా దీర్ఘకాలంగా ప్రభుత్వానికి బకాయిలు పెట్టి తప్పించుకు తిరుగుతున్న మిల్లర్లపై కొరడా ఝులిపించనున్నట్టు తెలిసింది.
దీర్ఘకాల బకాయిలపై దృష్టి..
ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు కేటాయించి, బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అప్పగించే విధానమే కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్). కొందరు మిల్లర్లు గడువులోగా సీఎంఆర్ అప్పగించకపోవడం, బకాయిలను ఏండ్ల తరబడి కొనసాగించడం ప్రభుత్వానికి ఆర్థిక భారంగా మారుతున్నది. ఇలాంటి మిల్లులను గుర్తించి వాటి వద్ద ఉన్న ధాన్యం, బియ్యం నిల్వలు, మిల్లింగ్ సామర్థ్యం, రికార్డులు, స్టాక్ రిజిస్టర్లను కమాండోలు పరిశీలించే అవకాశం ఉంది. రికార్డుల్లో ఉన్న నిల్వలకు, వాస్తవ నిల్వలకు వ్యత్యాసం ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. కమాండోలతో ఏర్పాటు చేసే స్పెషల్ టీంలు జిల్లాలవారీగా మిల్లుల్లో తనిఖీలు నిర్వహించనున్నాయి. ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మిక తనిఖీల ద్వారా వాస్తవ నిల్వలను గుర్తించడంతోపాటు సీఎంఆర్ బకాయిలకు కారణాలను ఆరా తీయనున్నాయి. ధాన్యం లేదా బియ్యం నిల్వలను పక్కదారి పట్టించడం, రికార్డుల్లో తప్పుడు వివరాలు నమోదు చేయడం, ప్రభుత్వానికి అప్పగించాల్సిన సీఎంఆర్‌ను ఉద్దేశపూర్వకంగా నిలిపివేయడంలాంటి అంశాలు వెలుగులోకి వస్తే కేసులు నమోదు చేయడంతోపాటు స్టాక్ సీజ్, లైసెన్స్ సంబంధిత చర్యలు, బకాయిల రికవరీ చేపట్టే అవకాశం ఉంది.
కమాండోలకు ప్రత్యేక శిక్షణ..
కొత్తగా విధుల్లో చేరిన కమాండోలతో సివిల్ సప్లయ్స్ కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం సివిల్ సప్లయ్స్ భవన్‌లో సమావేశమయ్యారు. తనిఖీల సందర్భంగా అనుసరించాల్సిన విధానాలు, చట్టపరమైన అంశాలు, బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు. కమాండోలకు ఇప్పటికే 3 రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. నిత్యావసర వస్తువుల చట్టాలు, సివిల్ సప్లయ్స్ నిబంధనలు, తనిఖీల సమయంలో పాటించాల్సిన విధానాలపై పోలీస్ అకాడమీలో అవగాహన కల్పించినట్టు చెప్పారు. 2025–26 సీజన్‌లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 154 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించిందని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ల కోసం సుమారు రూ.40 వేల కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. భారీ స్థాయిలో ధాన్యం సేకరించిన నేపథ్యంలో మిల్లింగ్, నిల్వ, సీఎంఆర్ ప్రభుత్వానికి చేరే ప్రక్రియపై పటిష్టమైన పర్యవేక్షణ అవసరమని, అందుకే కమాండోలను రంగంలోకి దించినట్టు వివరించారు.
2014- –15 నుంచి ఇప్పటివరకు మిల్లర్లు వెనక్కి ఇవ్వని ధాన్యం: 59.95 లక్షల టన్నులు దీని విలువ రూ.13,399.71కోట్లు
ఇప్పటి వరకూ సివిల్సప్లై శాఖ రికవరీ చేసిన ధాన్యం: 31.73 లక్షల టన్నులు
రికవరీ విలువ: రూ.6,768.97 కోట్లు
ఇంకా పెండింగ్ ధాన్యం: 28.22 లక్షల టన్నులు
విలువ: రూ. 6, 630.74 కోట్లు
