- పాలిఅమైడ్, పాలీఇథిలీన్ టెరెఫ్తలేట్ లే ఎక్కువ
- పోగుల రూపంలో పేరుకుంటున్నట్టు గుర్తించిన రీసెర్చర్లు
- ఆంధ్రా యూనివర్సిటీ పరిశోధకుల స్టడీలో ఆందోళనకర విషయాలు
హైదరాబాద్, వెలుగు: మనం ఎంతో ఇష్టంగా తినే సముద్రపు చేపలు ప్లాస్టిక్ మయమవుతున్నాయి. నిత్యం మనం విచ్చలవిడిగా వాడి పారేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో చేరి, సూక్ష్మ కణాలుగా మారి చివరకు మన వంటిట్లోకి, మన శరీరాల్లోకే చేరుతున్నాయి. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి సేకరించిన చేపల్లో ప్రమాదకర స్థాయిలో ‘మైక్రోప్లాస్టిక్స్’ (5 మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు) ఉన్నట్టు వెల్లడైంది.
విశాఖ హార్బర్ నుంచి మనం తినే మెత్తలు, మరో రకం చేపలపై ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. 130 నమూనాలు తీసుకుకొని పరిశీలించి.. 80 శాతానికిపైగా చేపల్లో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్టు నిర్ధారించారు. సిటీ పరిధిలోని వ్యర్థాలు, ఇండస్ట్రీ రసాయన వేస్ట్, డ్రైనేజీలు, పోర్టు హార్బర్ కార్యకలాపాల వల్ల ప్లాస్టిక్ సముద్ర జలాల్లోకి చేరుతున్నదని, దీంతో ఈ చేపలు వాటిని తింటున్నాయని చెబుతున్నారు.
ఒక్కో చేపలో 8 వరకు మైక్రోప్లాస్టిక్స్ఉన్నట్టు తేల్చారు. మామూలుగా ప్లాస్టిక్స్‌ను చేపలు మింగినప్పుడు కేవలం జీర్ణకోశం వరకే పరిమితమవుతాయని ఇప్పటివరకు భావించారని.. కానీ, చేప మాంసం, మొప్పల్లో కూడా ఈ మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మొప్పల్లో 1 నుంచి 2.5 మిల్లీమీటర్ల సైజున్న ప్లాస్టిక్కణాలున్నాయని తేల్చిన సైంటిస్టులు.. శ్వాస తీసుకోవడం వల్ల మొప్పలు దెబ్బతిని చేపలకు ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని గుర్తించారు. కడుపు, పేగుల్లో 1.5 నుంచి 2 మిల్లీమీటర్ల సైజున్న ప్లాస్టిక్ కణాలు, మాంసంలో 3 నుంచి 4.5 మిల్లీమీటర్ల సైజున్న ప్లాస్టిక్ కణాలను గుర్తించారు. చేప టిష్యూ దెబ్బతినడం వల్ల అవి మాంసంలోకి చేరుతున్నట్టు తేల్చారు.
పోగులుగానే ఎక్కువ..
చేపల్లో గుర్తించిన మైక్రోప్లాస్టిక్స్‌లో ఎక్కువ భాగం ఫైబర్ (పోగులు) రూపంలోనే ఉన్నట్టు రీసెర్చర్లు గుర్తించారు. 79.8 శాతం వరకు ఫైబర్ రూపంలోనే ప్లాస్టిక్ ఉందని తేల్చారు. చిన్నచిన్న ముక్కలుగా 11.4 శాతం, ఫోమ్ రూపంలో 8.8 శాతం వరకు ఉన్నట్టు నిర్ధారించారు. ఎరుపు రంగు ప్లాస్టిక్స్ 57 శాతం, నీలం 35 శాతం, నలుపు 25 శాతం, తెలుపు 17 శాతం, ఆకుపచ్చ 7 శాతం, పసుపు రంగు ప్లాస్టిక్స్ 5 శాతం వరకున్నాయని తేల్చారు.
ఎక్కువగా పాలి అమైడ్ (నైలాన్), పాలీఇథిలీన్ టెరెఫ్తలేట్(పెట్) వాటా అత్యధికంగా 64.21 శాతం మేర చేపల్లో గుర్తించారు. ఇవి కాకుండా పాలిస్టర్ 24 శాతం, పాలిఇథిలీన్ 15 శాతం, పాలిఅక్రిలేట్ 10 శాతం, పాలిప్రొపైలిన్ 7 శాతం ఉన్నట్టు తేలింది. ఇవన్నీ ప్రధానంగా మత్స్యకారులు వాడి సముద్రంలో పారేసిన నైలాన్ వలలు, ప్లాస్టిక్ తాళ్లు, ప్యాకేజింగ్ బాటిళ్లు, దుస్తుల సింథటిక్ వ్యర్థాల నుంచి వచ్చినవేనని గుర్తించారు.
తింటే మనుషులకు ముప్పు
నెత్తళ్లు వంటి చిన్న చేపలు ప్లాంక్టన్లు అనుకుని మైక్రోప్లాస్టిక్స్‌ను తింటున్నాయి. వాటిని పెద్ద చేపలు, ఆ పెద్ద చేపలను మనుషులు తినడం వల్ల ఈ ప్లాస్టిక్ మన ఫుడ్ చెయిన్లోకీ వచ్చేస్తున్నదని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మైక్రోప్లాస్టిక్స్‌లో బిస్ఫినాల్-ఎ, థాలేట్స్, పాలీబ్రోమినేటెడ్ డైఫినైల్ ఈథర్స్ వంటి ప్రమాదకర రసాయనాలుంటున్నాయని, ప్లాస్టిక్ కలుషిత చేపలను తినడం వల్ల హార్మోన్ల సమతుల్యత, రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినడం, జీర్ణకోశ సమస్యలు, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, మన దేశంలో ఏటా 35 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు విడుదలవుతున్నాయని రిపోర్టులో పేర్కొన్నారు. విశాఖ తీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, పాత వలలు సముద్రంలో పారవేయకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని, పారిశ్రామిక-నగర వ్యర్థాలను శుద్ధి చేశాకే సముద్రంలోకి వదలాలని పరిశోధకులు స్పష్టం చేశారు.
