- త్వరలోనే పీసీసీ చీఫ్, క్రమశిక్షణా కమిటీని కలుస్తం
- కొండా సుస్మితతో ప్రతిపక్షాలే ఇలా మాట్లాడిస్తున్నయ్
- వ్యాఖ్యలతో సంబంధం లేదన్న సురేఖ ఖండించలేదేం
- పార్టీ నుంచి బహిష్కరించ కముందే ఆమె పార్టీ వీడాలి
- రాజగోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయని, దీనికి బాధ్యత వహించని మంత్రి కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకమాండ్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విజ్ఞప్తి చేశారు. కూతురు వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసును వెనక్కి తీసుకోవాలని పీసీసీ క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ వివరణ ఇవ్వడంపై నేతలు మండిపడ్డారు. సుస్మిత వ్యాఖ్యలతో సంబంధం లేదన్నప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై ఆమె చేసిన ఆరోపణలను మంత్రి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. సుస్మిత వ్యాఖ్యల వెనుక బీజేపీ, బీఆర్‌ఎస్ ఉన్నాయని ఆరోపించారు. శుక్రవారం సీఎల్పీలో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీడియా సమావేశం నిర్వహించారు. కొండా సురేఖ తీరును తప్పుబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డిని బలహీనపరిచేందుకు ప్రతిపక్షాలు కొండా కుటుంబంతో ఇలా మాట్లాడిస్తున్నాయని ఆరోపించారు. కొండా సురేఖ వెంటనే సీఎంకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేదంటే హైకమాండ్ చర్యలు తీసుకునేలోపే పార్టీ నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.
పార్టీ లైన్ దాటిన మంత్రి కొండా సురేఖతోపాటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డిపైనా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని కలిసి కోరనున్నట్టు తెలిపారు.
బహిరంగ విమర్శలు తగవు: విప్ బీర్ల అయిలయ్య
సుస్మిత వ్యాఖ్యలతో సంబంధం లేదంటున్న కొండా సురేఖ వాటిని ఎందుకు ఖండించలేదని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ విషయాలను అంతర్గత సమావేశాల్లో చర్చించుకోవాలే తప్ప బహిరంగ విమర్శలు చేయడం సరికాదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిపై వ్యాఖ్యలను ఖండించారు.
పార్టీలో కొనసాగే నైతిక హక్కులేదు: వేముల
సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయాలను తప్పుపట్టేవారికి పార్టీలో కొనసాగే నైతిక హక్కు లేదని విప్ వేముల వీరేశం అన్నారు. సీఎంను, ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్న కొండా సురేఖపై హైకమాండ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం వెనుక రేవంత్‌రెడ్డి కృషి ఎంతో ఉందని గుర్తు చేశారు.
ప్రతిపక్షాల కుట్రను అమలుచేస్తున్రు: బాలునాయక్
సీఎం రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరచాలనే ప్రతిపక్షాల కుట్రను కొండా సురేఖ అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే బాలు నాయక్ ఆరోపించారు. సుస్మిత వ్యాఖ్యలను చూసి కార్యకర్తలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బహిష్కరించక ముందే వెళ్లిపోవాలి: నాయిని
కాంగ్రెస్ పార్టీ బహిష్కరించకముందే కొండా సురేఖ పార్టీ నుంచి వెళ్లిపోవాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. సుస్మిత వ్యాఖ్యల వెనుక బీజేపీ, బీఆర్‌ఎస్‌తోపాటు పార్టీలోని కొందరు నేతలు ఉన్నారని ఆరోపించారు. టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు తిరిగి ఇక్కడికి వచ్చిన వారు కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు.
రాజగోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డిపైనా చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
మంత్రి కొండా సురేఖతో పాటు పార్టీ లైన్ దాటిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డిపైనా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు డిమాండ్ చేశారు. పార్టీకి నష్టం చేసే వారిని బర్తరఫ్ చేయాలని కోరారు. ఎమ్మెల్యే రేవూరిని రాజీనామా చేయాలంటున్న సుస్మిత.. ముందుగా ఆమె తల్లి సురేఖను రాజీనామా కోరాలని సూచించారు.
కార్యకర్తలు సహించరు: వీర్లపల్లి శంకర్
సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచితంగా మాట్లాడటాన్ని పార్టీ కార్యకర్తలు, తెలంగాణ సమాజం సహించబోరని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కొండా సురేఖ.. సీఎంను, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదని పేర్కొన్నారు. గెలిపించిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా కొండా సురేఖ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డి వ్యవహరిస్తున్నారని అన్నారు.
కఠిన చర్యలు తప్పవు: బల్మూరి వెంకట్
పార్టీ కన్నా తామే పెద్ద అని భావించేవారు కాంగ్రెస్‌ను వీడాలని విప్ బల్మూరి వెంకట్ అన్నారు. వ్యక్తిగత విభేదాలుంటే అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని, బహిరంగంగా విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
