- కంపెనీలకు 5 శాతం వరకు ఇన్సెంటివ్స్
- రూ.39 లక్షల కోట్ల విలువైన ఫోన్ల ఉత్పత్తి
- 60 వేల జాబ్స్ వచ్చే చాన్స్
- మార్కెట్లోకి మూడు కొత్త ఫోన్ల బ్రాండ్ల ఎంట్రీ
- కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
న్యూఢిల్లీ: మనదేశంలో ఫోన్లు, విడిభాగాల తయారీని పెంచడానికి కేంద్రం రూ.62,500 కోట్ల చెక్‌ను రెడీ చేస్తోంది. కంపెనీలకు రాయితీలు ఇవ్వడానికి మొబైల్ ఫోన్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్ (ఎంపీఎంఎస్) పథకాన్ని శనివారం ప్రకటించింది. ఇది ప్రస్తుత సంవత్సరం ఏప్రిల్ నుంచి 2031 వరకు కొనసాగుతుంది.
ఎంపీఎంఎస్ పథకం కింద అర్హత పొందిన కంపెనీలకు మొబైల్ ఫోన్ అమ్మకాలపై 2.25 శాతం నుంచి 5 శాతం వరకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. విడిభాగాలను దేశీయంగానే సేకరించే కంపెనీలకు అదనంగా 1.5 శాతం రాయితీ దక్కుతుంది. భారతీయ బ్రాండ్ల సంఖ్యను పెంచడంలో భాగంగా పరిశోధనల కోసం అదనంగా మూడు శాతం ప్రోత్సాహం ఇస్తారు. దేశీయ కంపెనీలు ఐదు శాతం వరకు ప్రోత్సాహకాలు పొందే అవకాశం ఉంది. కేంద్ర మంత్రివర్గం ఈనెల 15 న ఎంపీఎంఎస్కు ఆమోదం తెలిపింది. రాబోయే ఐదేళ్లలో రూ.39 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల ఉత్పత్తి, 60 వేల ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు.
పీఎల్ఐ 1.0 స్కీమ్ సక్సెస్
గతంలో అమలులో ఉన్న పీఎల్ఐ 1.0 పథకం 2026 మార్చితో ముగిసింది. దీని ద్వారా రూ.8.12 లక్షల కోట్ల లక్ష్యానికి గాను, రూ.11.61 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి జరిగింది. రూ.20,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దాదాపు 12 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. శామ్సంగ్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీలు భారత్ లో తయారీని మొదలుపెట్టాయి. ఇండియా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా ఎదిగింది.
దేశంలో వాడే ఫోన్లలో 99.2 శాతం ఇక్కడే తయారవుతున్నాయి. 2014–2025 మధ్య ఫోన్ల ఎగుమతులు166 రెట్లు పెరిగాయి. 2025లో దేశం మొత్తం ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో 61 శాతం వాటా ఫోన్లదే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం విడిభాగాల తయారీపై దృష్టి పెట్టింది. గతంలో దేశీయంగా 15 శాతం ఉన్న వీటి విలువ, ప్రస్తుతం 23 శాతానికి పెరిగింది. రాబోయే -14 నెలల్లో మూడు కొత్త భారతీయ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
