Golconda Fort: గోల్కొండ కోట దగ్గర భూగర్భంలో రహస్య గది!

Golconda Fort: గోల్కొండ కోట దగ్గర  భూగర్భంలో రహస్య గది!
  • పటాన్​చెరు దర్వాజ.. కుతుబ్​షాహీల శ్మశానవాటిక సమీపంలోనే...
  • ఆర్మీ చదును చేస్తుండగా బయటపడిన రూమ్​
  • సొరంగం అంటూ ప్రచారం 
  • చార్మినార్​కు దారి ఉందంటూ వార్తలు  
  • స్టోర్​రూమ్​ లేక బంకర్ అయి ఉండొచ్చన్న పురావస్తు శాఖ 

మెహిదీపట్నం, వెలుగు: చారిత్రక గోల్కొండ కోట పరిధిలోని పటాన్‌‌చెరు దర్వాజా సమీపంలో , కుతుబ్‌‌షాహీ శ్మశానవాటిక దగ్గర ఉన్న 'అఠారా సీడీ' వద్ద గురువారం సాయంత్రం ఆర్మీ తవ్వకాల్లో భూగర్భంలో ఓ నిర్మాణం బయటపడింది. అయితే, ఇది సొరంగం అని, ఇక్కడి నుంచి చార్మినార్ కు డైరెక్ట్​దారి ఉందంటూ సోషల్​మీడియాలో విస్తృత ప్రచారం సాగింది. అయితే, విషయం తెలుసుకున్న పురావస్తు శాఖ అధికారులు రంగ ప్రవేశం చేసి ఆ నిర్మాణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చివరకు అది గోల్కొండ పాలకుల కాలంలో ఉపయోగించిన ఒక సీక్రెట్​గది అని తేల్చారు. 

ఎలా బయటపడింది?

సీక్రెట్​రూమ్​బయటపడిన ప్రాంతం చుట్టుపక్కల ఖాళీ మైదానం ఉండడంతో పిల్లలు క్రికెట్​ఆడడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే, రాత్రి వేళ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారం ఉంది. దీంతో పక్కనే ఆర్టిలరీ సెంటర్ ఉండడంతో ఆర్మీ రంగ ప్రవేశం చేసింది. అగ్నివీర్ శిక్షణ కోసం ఉపయోగించేందుకు ఇక్కడి చెట్లను తొలగించి స్థలాన్ని చదును చేసే పనులు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఒకచోట తవ్వుతుండగా ఈ నిర్మాణం బయటపడింది. విషయం తెలియడంతో స్థానికులు, ప్రజలు అక్కడకు భారీగా తరలివచ్చారు. సోషల్ మీడియాలో వార్తలు వైరల్​కావడంతో ఆర్కియాలజీ సర్వే ఆఫ్​ఇండియా అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. 

స్టోరేజీ ఛాంబరా? బంకరా ?  

అధికారులు పరిశోధించి ఆ నిర్మాణం సొరంగం మాత్రం కాదని, స్టోరేజ్ ఛాంబర్ లేక బంకర్​అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పూర్తి స్థాయి పరిశోధన తర్వాత అసలు విషయం తెలుస్తుందన్నారు. బయటపడిన రూమ్​1.2 మీటర్ల వెడల్పు, 1.8 మీటర్ల పొడవు, 2.2 మీటర్ల లోతుతో రెక్టాంగెల్​షేప్​లో ఉందని ప్రకటించారు. గ్రానైట్ రాళ్లతో నిర్మించారని, ఇంటీరియర్ గోడల మాదిరిగా చుట్టూ సాధారణ రాళ్లను పేర్చారని పేర్కొన్నారు. ఈ ప్రాంతం చాలా ఎత్తులో ఉండడంతో లోపలి కోట గోడలు, దారులు మూసుకుపోయాయని అంటున్నారు. గతంలో మధ్య యుగానికి చెందిన కొన్ని ఎరుపు రంగు మట్టి పాత్రల శకలాలు ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లో దొరికాయని స్పష్టం చేశారు. తమ పరిశోధన పూర్తయ్యేంత వరకు భూమిని చదును చేసే పనులను ఆపాలని ఆర్మీ అధికారులను పురావస్తు శాఖ విజ్ఞప్తి చేసింది.  

అసలీ స్థలం ఎవరిది? 

ఈ స్థలం తమకు సంబంధించినదని పురావస్తు శాఖ వాదిస్తుండగా, కాదు కాదు తమదే అంటూ కేంద్ర రక్షణ శాఖ అధికారులు వాదిస్తున్నారు. ఈసారి కూడా అదే వివాదం ఉండడంతో అధికారులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. ఘటనా స్థలాన్ని ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్‌‌ మొహియుద్దీన్, గోల్కొండ తహసీల్దార్​ప్రవీణ్, గోల్కొండ ఇన్​స్పెక్టర్​ సైదులు పరిశీలించారు. స్థల వివాదం ఆ రెండు వర్గాలే కూర్చుని పరిష్కరించుకుంటారని తహసీల్దార్​పేర్కొన్నారు.