మాటల్లో మాధుర్యం, నటనలో సహజత్వం, హావభావాల్లో వైవిధ్యం.. కలగలిసిన నటి ‘షావుకారు’ జానకి. కథానాయికగానే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రతినాయక ఛాయలున్న పాత్రలతోనూ మెప్పించి నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారామె. ఏడు దశాబ్దాల ప్రయాణంలో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఆమె సుధీర్ఘ సినీ ప్రయాణం చిరస్మరణీయం.
1931 డిసెంబరు 12న రాజమండ్రిలో జన్మించిన జానకి, అసలు పేరు శంకరమంచి జానకి. సాధారణ పరిస్థితుల నుంచి సినిమా రంగంలోకి వచ్చిన మహిళ. ఆమె చిన్న వయసులోనే రేడియో, నాటక రంగాలతో కళల ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆకాశవాణి మద్రాస్‌లో రేడియో ఆర్టిస్టుగా పనిచేయడంతో పాటు 300కిపైగా నాటకాల్లో నటించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా ఆమెను నటనా రంగం వైపు నడిపించాయి. ఆ నిర్ణయం తర్వాత దక్షిణ భారత సినిమా చరిత్రలో ఒక సుదీర్ఘ అధ్యాయంగా మారారు.
వెండితెర ‘షావుకారు’
1950లో ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ‘షావుకారు’ జానకి తొలిచిత్రం. ఇందులో ఆమె ఎన్టీ రామారావుకు జంటగా నటించారు. ఈ చిత్రంలో ఆమె పోషించిన ‘సుబ్బులు’ అనే అమాయకపు, పక్కింటి యువతి పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. . అప్పటినుంచి ఆమె ‘షావుకారు జానకి’గా గుర్తింపును అందుకున్నారు. ఆ తర్వాత రెండేళ్లకు తమిళంలోనూ, మూడో ఏడాదికి కన్నడలోనూ ఎంట్రీ ఇచ్చారు. 1954లో వచ్చిన ‘వద్దంటే డబ్బు’ చిత్రంతో ఆమె నటిగా మరింత గుర్తింపును అందుకున్నారు. ఆ తర్వాతి రెండేళ్లలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏడాదికి పన్నెండు సినిమాలతో ఆమె ఫుల్ బిజీ అయ్యారు. కన్యాశుల్కం (1955)లో ఆమె పోషించిన బుచ్చమ్మ పాత్ర అత్యంత ప్రాచుర్యం పొందింది. ఇందులో ఆమె నటన ఎంతో సహజంగా, నాటి సాంఘిక వ్యవస్థను ప్రతిబింబించేలా ఉందని ప్రశంసలు అందుకుంది. అలాగే ‘రోజులు మారాయి’ (1955)లో అల్లరి పిల్లగా, అమాయకపు యువతిగా వైవిధ్యభరిత నటనతో ఆకట్టుకున్నారు.
‘మంచి మనసులు’ (1962)లో ఎంతో హుందాగా, భావోద్వేగభరిత పాత్రతో మెప్పించారు. ‘డాక్టర్ చక్రవర్తి’ (1964)లో పోషించిన నిర్మల పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఇందులో ఆమె వాచ్ చూస్తూ అసహనంగా ముఖం పెట్టే హావభావాలు చాలా ఫేమస్ అయ్యాయి. అలాగే శివాజీ గణేశన్ ‘ఫుతియ పరవై’ (1964)లో క్లబ్ డాన్సర్‌గా గ్లామరస్‌గా కనిపిస్తూనే, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో తన నటనలోని మరో కోణాన్ని బయటపెట్టారు. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇరు కోడుగల్’ (1969) చిత్రం ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఇందులో నటనకు తమిళనాడు ప్రభుత్వం నుండి ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. ఇలా తెలుగుతోపాటు ఇతర భాషల్లో దాదాపు 400కి పైగా సినిమాల్లో నటించారామె. తనను తాను ఒకే రకమైన పాత్రకు పరిమితం చేసుకోకుండా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు.
నాలుగు తరాల నటి
తెలుగులో వద్దంటే డబ్బు, కన్యాశుల్కం, పిచ్చి పుల్లయ్య, రేచుక్క పగటిచుక్క, కన్యాదానం, జయం మనదే, డాక్టర్ చక్రవర్తి చిత్రాల్లో హీరోయిన్‌గా మెప్పించారు. ఒకే తరానికి చెందిన నటిగా ఆమె మిగలలేదు. ఒక దశలో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్ర కథానాయకులతో హీరోయిన్‌గా కనిపించిన ఆమె, తర్వాతి తరాల హీరోల చిత్రాల్లో తల్లి, అత్త, బామ్మ, ఇతర కీలక పాత్రల్లోనూ ప్రేక్షకులను మెప్పించారు. గీతాంజలి, దేవి, శుభాకాంక్షలు, సంసారం ఒక చదరంగం, రంగూన్ రౌడీ, కంచె, బాబు బంగారం వంటి చిత్రాల్లో బామ్మ పాత్రలతోనూ ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ వంటి తరాల వరకు ఆమె తెరపై కనిపించడం విశేషం. ఏడు దశాబ్దాల పాటు కొనసాగిన కెరీర్‌లో నాలుగు తరాల నటీనటులు, టెక్నీషియన్స్‌తో పనిచేశారామె. జానకి చివరిగా నటించిన తెలుగు సినిమా ‘అన్నీ మంచి శకునములే’. అశ్వినీదత్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రం మూడేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
సహజ నటన, సంభాషణ చతురత
సౌత్ ఇండియన్ సినిమాలో షావుకారు జానకి గారిది ఒక ప్రత్యేకమైన స్థానం. ఆమె నటనలోని సహజత్వం, హుందాతనం, పాత్రకు తగ్గట్టుగా ఒదిగిపోవడం ఆమెను అగ్రశ్రేణి నటీమణులలో ఒకరిగా నిలిపాయి. ఎంత క్లిష్టమైన పాత్రయినా ఎంతో సులభంగా, వాస్తవానికి దగ్గరగా నటించడం ఆమె ప్రత్యేకత. కంటి చూపు, ముఖ కవళికలతోనే భావాలను పలికించడంలో ఆమెది అందెవేసిన చెయ్యి. సింపుల్ ఎక్స్‌ప్రెషన్స్‌తోనే బలమైన భావోద్వేగాలను ఆమె ప్రదర్శించేవారు. ఆమె పోషించడం వల్ల కొన్ని పాత్రలకు ఓ ప్రత్యేకమైన గౌరవం లభించేది. ఆమె తెలుగు, తమిళ, కన్నడ భాషలలో అనర్గళంగా మాట్లాడగలరు. దీంతో ఆయా పాత్రల స్వభావాన్ని బట్టి ఆమె ఉచ్ఛారణలో స్పష్టత, సంభాషణ చతురత కనిపించేది. హీరోయిన్ పాత్రలే కాకుండా భార్యగా, తల్లిగా, బాధ్యత గల ఇల్లాలు పాత్రలతో పాటు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలోనూ ఆమె మెప్పించారు.
పద్మశ్రీ సహా పలు అవార్డులు
2022లో కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ ప్రకటించడం ఆమె ఏడు దశాబ్దాల కళా సేవకు అధికారిక గుర్తింపుగా నిలిచింది. పద్మ పురస్కారాల అధికారిక వివరాల్లో ఆమెను ‘ఏడు దశాబ్దాలకు పైగా సేవలందించిన సీనియర్ నటి’గా, ఐదు భాషల్లో 400కుపైగా చిత్రాల్లో నటించిన కళాకారిణిగా పేర్కొన్నారు. అలాగే రెండు నంది పురస్కారాలు, తమిళనాడు ప్రభుత్వం నుండి కలైమామణి, ఉత్తమ నటి అవార్డు, ఫిలింఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు (దక్షిణాది), సైమా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు ఆమె అందుకున్న ముఖ్యమైన గౌరవాలు.
