ఫుడ్ సేఫ్టీ రైడ్స్: షాపులోని కల్తీ స్వీట్స్ తాను తినలేనంటూ దండం పెట్టేసిన ఓనర్..!

ఫుడ్ సేఫ్టీ రైడ్స్: షాపులోని కల్తీ స్వీట్స్ తాను తినలేనంటూ దండం పెట్టేసిన ఓనర్..!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా జరిగే ఫుడ్ సేఫ్టీ తనిఖీలు కాస్తా ఈ ఘటన కారణంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. తన సొంత షాపులో అమ్ముతున్న స్వీట్లను తినమని అధికారులు కోరితే.. ఆ దుకాణ యజమాని ఏమాత్రం ఆలోచించకుండా, మెుహమాట పడకుండా తిరస్కరించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. దీన్ని చూస్తే తెలుగు సినిమాలో టీ తాగటానికి హోటల్‌కి వెళ్లిన వ్యక్తి ఓనర్ ఎక్కడికెళ్లారని అంటే పక్కహోటల్‌లో టీ తాగటానికి వెళ్లాడని చెప్పిన సీన్ గుర్తుకొస్తోంది.

కల్తీ స్వీట్లపై ఫిర్యాదులు..
హమీర్‌పూర్‌లోని ఒక స్వీట్ షాపులో కల్తీ, నాణ్యత లేని నకిలీ స్వీట్లు అమ్ముతున్నారంటూ స్థానికుల నుంచి అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ కంప్లెయింట్లను తీవ్రంగా పరిగణించిన సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ నేతృత్వంలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు, స్థానిక పోలీసు సిబ్బంది తనిఖీలకు వెళ్లారు. దుకాణంలో విక్రయానికి ఉంచిన మిఠాయిల నాణ్యతను పరిశీలించి, తక్షణమే శాంపిల్స్ సేకరించడం ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశం.

ఊహించని పరిణామం..
తనిఖీలు జరుగుతున్న తరుణంలో అధికారుల ముందు ఒక విచిత్రమైన సన్నివేశం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న ఒక పోలీసు అధికారి షాపులోని ఒక స్వీట్‌ను చేతిలోకి తీసుకుని, దాన్ని తినవలసిందిగా షాప్ ఓనర్‌కు అందించారు. అయితే కస్టమర్లకు నిత్యం అమ్ముతున్న ఆ మిఠాయిని తినేందుకు చేతులు జోడించి మరీ నిరాకరించాడు సదరు ఓనర్. అధికారుల సమక్షంలోనే తన సొంత సరుకును తినేందుకు ఆయన వెనుకాడడం అక్కడ ఉన్నవారందరినీ ఆశ్చర్యపరిచింది.

నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
ఈ ఊహించని ఘటనకు సంబంధించిన పూర్తి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. "తన దుకాణంలోని స్వీట్లే స్వయంగా తినలేని వ్యాపారి, వాటిని అమాయక ప్రజలకు ఎలా అమ్ముతున్నాడు?" అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ విడ్డూరమైన పరిస్థితిని చూసిన అధికారులు వెంటనే అప్రమత్తమై, దుకాణంలో ఉన్న స్వీట్స్ పారేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఘటన ఫుడ్ సేఫ్టీ తనిఖీల ప్రాముఖ్యతను మరోసారి సమాజానికి గుర్తుచేసింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ కల్తీ ఆహార పదార్థాలు విక్రయించే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సేకరించిన శాంపిల్స్ నివేదిక వచ్చిన తర్వాత నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఏదేమైనప్పటికీ.. తన దుకాణంలో కల్తీని తానే అంగీకరించినట్లుగా ఆ షాప్ ఓనర్ చేసిన పని దేశవ్యాప్తంగా ప్రజలను షాక్ కి గురిచేసింది.