హైదరాబాద్: గచ్చిబౌలి ప్రాంతంలోని అంజయ్య నగర్ బిల్డింగ్ ప్రమాదంపై హైడ్రా చీఫ్ రంగనాథ్ ఆరా తీశారు. అధికారులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనాన్ని 50 గజాల్లో నిర్మిస్తున్నారని తెలిపారు. ఈ ప్రమాదంలో భవనంలో పని చేస్తోన్న ఇద్దరు కార్మికులు మృతి చెందారని చెప్పారు. కుప్పకూలిన బిల్డింగ్ చుట్టూ మొత్తం హాస్టల్స్ ఉన్నాయన్నారు.
బిల్డర్ సాజిద్ ఈ బిల్డింగ్ నిర్మించి విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. 50 గజాల్లో బిల్డింగ్స్ నిర్మించి హస్టల్స్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం సాజిద్ పరారీలో ఉన్నాడని చెప్పారు. ప్రమాదానికి కారణమైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. ఎవరినీ ఉపేక్షించమని హెచ్చరించారు. అంజయ్య నగర్లో అక్రమాలన్నీ తొలగిస్తామని చెప్పారు.
గచ్చిబౌలి ప్రాంతంలోని అంజయ్య నగర్లో నాలా పక్కనే 50 గజాల స్థలంలో నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం శనివారం (ఆగస్ట్ 22) మధ్యాహ్నం కుప్పకూలింది. ఒక్కసారిగా భవనం కుప్పకూలి పక్కనే ఉన్న మరో అపార్ట్‌మెంట్‌పై పడడంతో ఆ భవనం కూడా దెబ్బతిన్నది. ఏడంతస్తుల భారీ భవనం పేకమేడలా ఒక్కసారిగా కుప్పకూలిడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది హూటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
శిథిలాల కింద నుంచి డీఆర్ఎఫ్ సిబ్బంది రెండు మృతదేహాలను వెలికితీశారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని రక్షించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏడంతస్తుల భవనం నిమిషాల వ్యవధిలో కుప్పకూలడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. నాలా పక్కనే కేవలం 50 గజాల స్థలంలో ఏడంతస్తుల భవనం నిర్మించేందుకు అనుమతులు ఎలా ఇచ్చారంటూ అధికారులపై మండిపడుతున్నారు స్థానికులు.
