- కేంబ్రిడ్జ్, ఇంపీరియల్ కాలేజీలతోనూ తెలంగాణ సర్కారు కీలక భాగస్వామ్యం
- కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సహకారంతో ‘ఫ్రూగల్ ఏఐ’
- రాష్ట్రంలో గ్లోబల్ ఇంక్యుబేషన్ సెంటర్
- క్రియేటివ్ ఎకానమీలో లివర్‌పూల్‌తో భాగస్వామ్యం
- అక్టోబర్‌లో రాష్ట్రానికి లివర్‌పూల్ బృందం రాక
- సీఎం రేవంత్ రెడ్డి టీమ్ యూకే టూర్ సక్సెస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ‘లండన్ యూనివర్సిటీ’ క్యాంపస్ ఏర్పాటు కానున్నది. లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ బృందం రాష్ట్ర ఉన్నత విద్యా రంగానికి సంబంధించి కీలక ఒప్పందం చేసుకున్నది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, సోయాస్ (ఎస్ఓఏఏఎస్) ప్రపంచ ప్రఖ్యాత సంస్థలను అనుసంధానిస్తూ అకడమిక్ ఫెడరేషన్ పద్ధతిలో ఈ క్యాంపస్‌ను తీసుకురావాలని నిర్ణయించారు. దీనికి తోడు ప్రపంచ ప్రసిద్ధ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో సైతం తెలంగాణ ప్రభుత్వం చేతులు కలిపింది. కేంబ్రిడ్జ్ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఫ్రూగల్ ఏఐ), స్టార్టప్ ఇంక్యుబేషన్, సంయుక్త పరిశోధనలను ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. ‘తెలంగాణ రైజింగ్’ లక్ష్యంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు బృందం జరిపిన ఉన్నత స్థాయి చర్చలు పూర్తిగా ఫలించాయి.మన విద్యార్థులు గ్లోబల్ డిగ్రీల కోసం విదేశాలకు వెళ్లాల్సిన పనిలేకుండా, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను హైదరాబాద్‌లోనే అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపారు.
హైలెవల్ భేటీలో అధికారిక ప్రకటన
లండన్ యూనివర్సిటీకి చెందిన చారిత్రక సెనేట్ హౌస్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన హైలెవల్ రౌండ్ టేబుల్ భేటీలో క్యాంపస్ ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబుతోపాటు సీఎం సలహాదారులు కె.రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ పాల్గొని కీలక చర్చలు జరిపారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్, స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ ప్రతినిధులు సైతం ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో భాగస్వాములయ్యారు. హైదరాబాద్‌లో త్వరలోనే తమ పూర్తిస్థాయి క్యాంపస్‌ను నెలకొల్పేందుకు అవసరమైన కార్యాచరణను వేగవంతం చేస్తున్నామని లండన్ వర్సిటీ ప్రతినిధులు వెల్లడించారు. వర్సిటీ పరిధిలోని వివిధ విద్యా విభాగాలు, స్కూళ్ల ద్వారా విస్తృతస్థాయి కోర్సులు, డిగ్రీలను స్థానిక విద్యార్థులకు అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న వివిధ అకడమిక్ విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెస్తూ ఈ క్యాంపస్ పనిచేయనుంది.
కేంబ్రిడ్జ్ విద్యావేత్తలతో చర్చలు ఫలప్రదం
ప్రపంచ ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విద్యావేత్తల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి బృందం జరిపిన చర్చలు కూడా అత్యంత ఫలప్రదంగా ముగిశాయి. కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్ మార్కెటింగ్ చైర్ ప్రొఫెసర్ జైదీప్ ప్రభు, ఫ్రూగల్ ఏఐ కో-చైర్ ప్రొఫెసర్ వెంకట సిరీశ్ గండికోటతో రాష్ట్ర బృందం విస్తృత సమాలోచనలు జరిపింది. హైదరాబాద్‌ను విజ్ఞాన రాజధానిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పూర్తి సహకారం అందించేందుకు కేంబ్రిడ్జ్ ప్రతినిధులు ముందుకొచ్చారు. ముఖ్యంగా ‘ఫ్రూగల్ ఏఐ’ రంగంలో అత్యాధునిక పరిశోధనలు, సంయుక్త విద్యా కార్యక్రమాల నిర్వహణపై ఇరువర్గాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. రాష్ట్రంలోని యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థుల ఆవిష్కరణలకు అంతర్జాతీయ స్థాయిలో ఊతమిస్తూ బలమైన ఇంక్యుబేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. స్టార్టప్‌ల అభివృద్ధికి గ్లోబల్ మెంటార్‌షిప్ కల్పించేందుకు కేంబ్రిడ్జ్ ప్రతినిధులు పూర్తి సంసిద్ధత వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో సాంకేతిక పరిశోధనలు, సరికొత్త బిజినెస్ ఐడియాల అమలు కోసం కేంబ్రిడ్జ్‌తో కలిసి ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నారు.
యూకే పర్యటనలో సీఎం కీలక చర్చలు
యూకే పర్యటనలో భాగంగా లివర్‌పూల్ సిటీ డెవలప్‌మెంట్ విభాగం, ప్రఖ్యాత లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్ ప్రతినిధులతోనూ సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు జరిపారు. లైఫ్ సైన్సెస్, అత్యాధునిక సాంకేతికత, క్రీడారంగం, క్రియేటివ్ ఎకానమీ రంగాల్లో తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకునేందుకు సుసాన్ ఫిన్నెగాన్, నూలా గల్లాఘర్ బృందం ముందుకొచ్చింది. ఈ ఒప్పందాలను అధికారికంగా ఖరారు చేసుకునేందుకు లివర్‌పూల్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం రానున్న అక్టోబర్‌లో హైదరాబాద్‌ను సందర్శించనుంది. నగరంలో క్రీడా మౌలిక వసతులు, ఫుట్‌బాల్ అకాడమీలు, బయోటెక్నాలజీ రంగాల విస్తరణకు ఈ భాగస్వామ్యం ఎంతగానో దోహదపడనుంది. అటు లండన్ యూనివర్సిటీ క్యాంపస్, కేంబ్రిడ్జ్, ఇంపీరియల్ కాలేజీల భాగస్వామ్యాలు.. ఇటు లివర్‌పూల్ ఒప్పందాలతో సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన అద్భుత విజయాలను సాధించింది. డిసెంబర్‌లో జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్ సమిట్‌కు ముందే కుదిరిన ఈ కీలక బహుముఖ ఒప్పందాలు తెలంగాణను అంతర్జాతీయ నాలెడ్జ్ హబ్‌గా మార్చడంలో సరికొత్త చరిత్ర సృష్టించనున్నాయి.
ఇంపీరియల్ కాలేజీని సందర్శించినసీఎం సలహాదారు
మరోవైపు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్ , మేనేజ్‌మెంట్ విద్యలో అంతర్జాతీయ అగ్రగామి అయిన ఇంపీరియల్ కాలేజీని సీఎం సలహాదారు కె.రామకృష్ణారావు సందర్శించారు. ఇంపీరియల్ కాలేజీ అధ్యక్షుడి చీఫ్ ఆఫ్ స్టాఫ్ అమాండా వోల్తుయిజెన్, అంతర్జాతీయ వ్యవహారాల మేనేజర్ రొసాన్నా గిల్లెస్పీతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో విద్యా, పరిశోధనా రంగాల్లో ఉన్న అవకాశాలను వివరించి, రాష్ట్రంతో చేతులు కలపాలని ఆహ్వానించారు. దీనిపై ఇంపీరియల్ కాలేజీ యాజమాన్యం సానుకూలంగా స్పందిస్తూ.. హైదరాబాద్‌లో షార్ట్ టర్మ్ కోర్సులు, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లు నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తామని స్పష్టం చేసింది. పరిశోధనలతోపాటు అధ్యాపకులు, విద్యార్థుల మార్పిడి (ఎక్స్చేంజ్) కార్యక్రమాలపై భాగస్వామ్యానికి ఆసక్తి చూపింది. ఇదే క్రమంలో ఈ ఏడాది డిసెంబరు 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్’కు హాజరుకావాల్సిందిగా ఇంపీరియల్ కాలేజీ ప్రతినిధులను ప్రభుత్వం సాదరంగా ఆహ్వానించింది.
