1800 కి.మీ ఎల్పీజీ పైప్లైన్.. తెలంగాణలోని చెర్లపల్లి నుంచి ఒకటి

1800 కి.మీ ఎల్పీజీ పైప్లైన్.. తెలంగాణలోని చెర్లపల్లి నుంచి ఒకటి
  •  రూ.7000 కోట్లు కేటాయింపు
  •  ఐదు రాష్ట్రాల మీదుగా    మూడు ప్రాజెక్టులు

న్యూఢిల్లీ:  ఎల్పీజీ సరఫరాను మరింత మెరుగుపరచడానికి కేంద్రం రెడీ అయింది.  రోడ్డు రవాణాపై ఆధారపడటం తగ్గించడానికి సుమారు 1,800 కిలోమీటర్ల పైప్‌‌‌‌‌‌‌‌లైన్ల నిర్మాణానికి గ్రీన్​సిగ్నల్ ​ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు రూ.7,000 కోట్లు ఖర్చు చేయనుంది. 

ఫలితంగా కామన్- క్యారియర్ ఎల్పీజీ పైప్‌‌‌‌‌‌‌‌లైన్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ మరింత బలపడుతుందని పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులెటరీ బోర్డ్​  (పీఎన్‌‌‌‌‌‌‌‌జీఆర్‌‌‌‌‌‌‌‌బీ) ప్రకటించింది. తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక  గోవా రాష్ట్రాలలో మూడు ప్రాజెక్టులను చేపట్టనుంది. వీటిని ప్రభుత్వ రంగ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) అభివృద్ధి చేయనుంది.  

దీంతో కామన్ -క్యారియర్ ఎల్పీజీ పైప్‌‌‌‌‌‌‌‌లైన్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ 7,700 కిలోమీటర్ల నుంచి సుమారు 9,500 కిలోమీటర్ల వరకు.. అంటే 23 శాతం పెరగనుంది.  మనదేశం ఎల్పీజీ కోసం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది. చమురు మార్కెటింగ్​కంపెనీలు ఎల్పీజీని వివిధ ప్రాంతాలకు రోడ్డు మార్గాల్లో రవాణా చేస్తుంటాయి. 

పెద్ద పైప్‌‌‌‌‌‌‌‌లైన్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ అందుబాటులోకి రావడం ద్వారా ఈ రవాణా మరింత సమర్థవంతంగా జరుగుతుంది. తాజాగా ఆమోదించిన మూడు ప్రాజెక్టులలో 556 కిలోమీటర్ల చెర్లపల్లి–నాగ్‌‌‌‌‌‌‌‌పూర్ లైన్, 611 కిలోమీటర్ల ఝాన్సీ–సితార్‌‌‌‌‌‌‌‌గంజ్ పైప్‌‌‌‌‌‌‌‌లైన్,  633 కిలోమీటర్లల శిక్రాపూర్ నుంచి గోవా–హుబ్లీ లైన్ ఉన్నాయి. అంతకుముందు ఆమోదించిన 2,757 కిలోమీటర్ల కాండ్లా–-గోరఖ్‌‌‌‌‌‌‌‌పూర్ ఎల్పీజీ పైప్‌‌‌‌‌‌‌‌లైన్ ఆధారంగా ఈ కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. 

పైప్‌‌‌‌‌‌‌‌లైన్ల ద్వారా రవాణా చేయడం వల్ల రవాణా ఖర్చులు, ట్రాఫిక్ రద్దీ , కాలుష్యం, రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. ఈ పైప్‌‌‌‌‌‌‌‌లైన్ ప్రాజెక్టులు ఇంధన నిల్వలకు,  అత్యవసర సమయాల్లో సరఫరాకు ఎంతో ఉపయోగపడతాయని పీఎన్‌‌‌‌‌‌‌‌జీఆర్‌‌‌‌‌‌‌‌బీ  ప్రకటించింది.  

 మారిషస్​కు ఐఓసీ నుంచి ఇంధనం 

భారతదేశం, మారిషస్ ఇంధన సరఫరా భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకున్నాయి.  ఈ దేశానికి ఐదేళ్లపాటు పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్​ సహా అన్ని రకాల ఇంధనాలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) సరఫరా చేయనుంది. 

భారత పెట్రోలియం శాఖ మంత్రి హర్‌‌‌‌‌‌‌‌దీప్ సింగ్ పూరి ఈనెల 20, 21 తేదీల్లో మారిషస్‌‌‌‌‌‌‌‌లో పర్యటించిన సందర్భంగా ఐవోసీ, మారిషస్ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ మధ్య దీర్ఘకాలిక ఒప్పందం కుదిరింది. ధరల హెచ్చుతగ్గుల ప్రభావం నుంచి మారిషస్​కు రక్షణ ఉంటుంది. దక్షిణ ఆసియా వెలుపల ఒక భారతీయ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ కుదుర్చుకున్న మొట్టమొదటి దీర్ఘకాలిక సరఫరా ఒప్పందం ఇదేనని ఐవోసీ తెలిపింది. 

మారిషస్​కు అవసరమైన మోటార్ స్పిరిట్, హై స్పీడ్ డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌‌‌‌‌‌‌‌ను కూడా సరఫరా చేస్తామని పేర్కొంది. మనదేశం 23 రిఫైనరీల ద్వారా ఏటా 267 మిలియన్ టన్నుల రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తులను తయారు చేస్తుంది.