ఆర్టీసీ లాస్ట్ మైల్ కనెక్టివిటీని ఆపెయ్యాలి..ఆటో డ్రైవర్ల బంద్కు సంపూర్ణ మద్దతు: కవిత

ఆర్టీసీ లాస్ట్ మైల్ కనెక్టివిటీని ఆపెయ్యాలి..ఆటో డ్రైవర్ల బంద్కు సంపూర్ణ మద్దతు: కవిత

హైదరాబాద్, వెలుగు: ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు 24 నుంచి తలపెట్టిన బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. శనివారం బంజారాహిల్స్​లోని పార్టీ కార్యాలయంలో పలు ఆటో యూనియన్ల నాయకులతో కలిసి బంద్ పోస్టర్ ఆవిష్కరించారు. కవిత మాట్లాడుతూ.. ఆర్టీసీ యాజమాన్యానికి ఈవీ ఆటోలు ఇచ్చి లాస్ట్ మైల్ కనెక్టివిటీ సర్వీస్ ప్రారంభించాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు.

లాస్ట్ మైల్ కనెక్టివిటీ సర్వీసును ఇప్పుడున్న ఆటోడ్రైవర్లతో నడిపించాలన్నారు. “ఆటో, ట్రాన్స్ పోర్ట్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఓలా, ఉబర్, ర్యాపిడోలకు బదులుగా ప్రభుత్వమే యాప్ తీసుకురావాలి. ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల చొప్పున అందజేయాలి” అని డిమాండ్ చేశారు. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. 

బిల్డింగ్ ఓనర్ ను అరెస్ట్ చేయాలి

గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనపైనా కవిత స్పందించారు. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం ఎంత అవినీతిలో కూరుకుపోయిందో ఈ ఏడంతస్తుల భవనం తేటతెల్లం అయ్యిందన్నారు. కేవలం 50 గజాల స్థలంలో ఏడు అంతస్తులు కట్టిన   ఓనర్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.