కోల్‌బెల్ట్/ బెల్లంపల్లి రూరల్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా 3.5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, గంటకు 100 చొప్పున పరిష్కరించినా 300 ఏళ్లు పట్టే అవకాశం ఉందని హైకోర్టు న్యాయమూర్తి నగేశ్ భీమపాక తెలిపారు. శనివారం మంచిర్యాల జిల్లా మందమర్రిలో రూ.80 లక్షలతో ఏర్పాటు చేసిన కోర్టును, బెల్లంపల్లి మండలం కన్నాలలో రూ.5.60 కోట్లతో నిర్మించిన కోర్టు బిల్డింగ్‌ను ప్రారంభించారు. ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, ప్రజలు ఇగోలకు పోకుండా వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు.
రూ.80 లక్షలతో మందమర్రిలో కోర్టు ఏర్పాటు చేయడానికి సింగరేణి యాజమాన్యం చొరవచూపడం అభినందనీయమన్నారు. ప్రజలకు న్యాయ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కొత్త కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కొత్త బిల్డింగ్లు నిర్మించి సౌలతులు కల్పించడంతో కేసుల విచారణ, పరిష్కారం సులభతరం అవుతుందన్నారు. అంతకుముందు పలు ఆలయాల్లో పూజలు చేసి కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. మంచిర్యాల, అసిఫాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తులు ఎ.వీరయ్య, శారదాదేవి, కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, రామగుండం సీపీ అంబర్ కిశోర్‌ఝా, న్యాయమూర్తులు నిర్మల, రామ్మోహన్‌రెడ్డి, కవిత, కె.నిరోషా, శాంతిసోని, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్, మందమర్రి సీఐ పర్స రమేశ్ పాల్గొన్నారు.
