- మార్కెట్ విలువ రూ.25 కోట్లపైనే
- ఇప్పటికే నిందితుల అరెస్ట్.. తాజాగా ఆస్తులు స్వాధీనం
నిజామాబాద్, వెలుగు: డ్రగ్స్ అమ్మకాలతో సంపాదించిన రూ.5.15 కోట్ల ఆస్తులను నిజామాబాద్ పోలీసులు జప్తు చేశారు. నిషేధిత ఆల్ఫ్రాజోలం తయారు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఏడాది కింద పట్టుకున్నారు. అక్కడితో ఊరుకోకుండా, మత్తు మందు బిజినెస్‌తో కూడబెట్టిన స్థిర, చరాస్తులు, నగదును గుర్తించేందుకు 15 మంది పోలీసులతో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశారు.
ఏడాది పాటు శ్రమించి ఆస్తులను గుర్తించారు. వివరాలను శనివారం సీపీ సాయిచైతన్య మీడియాకు తెలిపారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో అమర్ సింగ్ ఎరువుల ఉత్పత్తి పేరిట పర్మిషన్ పొంది సూర్యప్రభ ఫార్మా కెమికల్ ఇండస్ట్రీలో ఆల్ఫ్రాజోలం తయారు చేయగా, అతడికి అహ్మద్‌నగర్‌కు చెందిన రాశీ ట్రేడర్స్ యజమాని పార్ట్‌నర్‌గా వ్యవహరించాడు. మహారాష్ట్రకు చెందిన బాబూరావు, బస్వరాజ్, షబ్బీర్ అలీ, పాషామియా, పరమేశ్వర్‌తో సరుకు రవాణా చేయించి దందా నడిపేవారు.
నిజామాబాద్ జిల్లా బాధ్యతలు సాలూరాకు చెందిన లక్ష్మణ్ గౌడ్ చూస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు నిఘా పెట్టి గత ఏడాది మే నెలలో పట్టుకున్నారు. వారి నుంచి 2.5 కిలోల ఆల్ఫ్రాజోలం స్వాధీనం చేసుకొని దర్యప్తు చేపట్టారు. టీం సభ్యుడైన కర్నాటకలోని గుల్బర్బాకు చెందిన స్వామిగౌడ్‌ను అరెస్ట్ చేశారు. వీరు సరఫరా చేసిన అల్ఫ్రాజోలం కలిపిన కల్లు తాగి కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్‌లో 68 మంది, గాంధారిలో 15 మంది అస్వస్థతకు గురైనట్లు గుర్తించారు.
దీనిని సీరియస్‌గా తీసుకున్న సీపీ సాయిచైతన్య నిందితులపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపారు. ఆ తరువాత మహారాష్ట్ర వెళ్లి అక్కడి పోలీసుల సహకారంతో రూ.3 కోట్ల విలువైన ఆల్ఫ్రాజోలం, రూ.12 లక్షల క్యాష్, రూ.4 కోట్ల విలువ కెమికల్ ఫ్యాక్టరీలను జప్తు చేశారు.
ఆస్తుల గుర్తింపు ఇలా..
అక్రమ దందాతో కూడబెట్టిన ఆస్తులను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన15 మంది పోలీస్ టీమ్ పూణే, సతారా, అహ్మద్ నగర్ సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ ఆఫీస్‌లకు వెళ్లి నిందితులు, వారి కుటుంబీకుల పేరిట ఉన్న స్థిర,చరాస్తులు గుర్తించి ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద ఆస్తులు జప్తు చేశారు. 9.06 ఎకరాల వ్యవసాయ భూమి, 1,370 గజాల ఓపెన్ జాగా, నాలుగు ఫోర్ వీలర్లు, రెండు బైక్‌లు, బ్యాంకుల్లో రూ.27 లక్షల క్యాష్ గుర్తించారు. జప్తు చేసిన ఆస్తుల మార్కెట్ విలువ రూ.25 వరకు ఉంటుందని అంచనా వేశారు.
