- మండిపడ్డ ఏఐటీయూసీ నేతలు
నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని అర్కే న్యూటెక్ గనిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు యాజమాన్యం పనితీరుకు అద్దం పడుతున్నాయని ఏఐటీయూసీ నాయకులు మండిపడ్డారు. శనివారం స్థానిక ఏఐటీయూసీ నేతలు గనిని సందర్శించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల చేతుల్లో పనిముట్లు లేకుండా, రక్షణ పరికరాలు ఇవ్వకుండా, తాగునీరు, గనిలో సరైన గాలి లేకుండా ఉత్పత్తి లక్ష్యాలు ఎలా సాధిస్తారని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. గనిలోని 17వ ప్యానెల్‌లో 11, 12, 13, 14 లెవెల్స్‌లో సరైన గాలి ప్రసరణ లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. వెంటనే గాలి ప్రసరణ సమస్యను పరిష్కరించి సురక్షితమైన పని వాతావరణం కల్పించాలని డిమాండ్ చేశారు. సేఫ్టీ షూస్, హ్యాండ్ గ్లోవ్స్, సాక్స్, డ్రిల్ సబ్బల్స్, హెల్మెట్లు వంటి రక్షణ పరికరాలను సకాలంలో అందించాలన్నారు. భూగర్భ గనిలో పనిచేసే కార్మికులకు కనీసం తాగునీరు కూడా అందించలేని పరిస్థితి నెలకొనడం యాజమాన్యం నిర్లక్ష్యానికి అద్దంపడుతోందని విమర్శించారు. నాయకులు వీరభద్రయ్య, బాజీ సైదా, కొట్టె కిషన్ రావు, ఎం.కొమరయ్య ఎ.సంపత్, లక్ష్మణ్, సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
