న్యూఢిల్లీ: చక్కెర ధరల పెరుగుదల, కేంద్ర ప్రభుత్వ ఈ20 విధానం అమలుకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు సిద్దమైన తహసీన్ పూనావాలాను ఢిల్లీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం జంతర్ మంతర్ వద్దకు వెళ్లకుండా ఆయనను అడ్డుకున్నారు.
శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును పోలీసులు హరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చనే కారణంతోనే ఆయనను అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో తన నివాసం వద్ద మోహరించిన పోలీసు సిబ్బందికి స్వయంగా చెరుకు రసం అందించి తహసీన్ వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో చక్కెర ధరలు విపరీతంగా పెరిగితే ఈ చెరుకు రసం కూడా సామాన్యులకు అందకుండా పోతుందని తెలిపారు.
కేంద్రం అమలుచేస్తున్న ఇథనాల్ బ్లెండింగ్ పాలసీ వల్ల వాహనాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో సామాన్యుల గృహ బడ్జెట్ చిన్నాభిన్నమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ నేతల ఫ్యామిలీలకు లబ్ధి చేకూర్చేందుకే ఈ విధానాలు తెచ్చారని విమర్శించారు.
